Bheemla Naiak: నేడే బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్, ఈ రూట్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - వీళ్లు మరో మార్గం చూసుకోవాల్సిందే!
Bheemla Naiak Pre Release Event: మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి11 గంటల మధ్య యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నేడు భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లుగా నగర పోలీసులు వెల్లడించారు. యూసఫ్ గూడలోని మైదానంలో జరిగే ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో జనం రానున్నారనే అంచనాల మధ్య ఆ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. యూసఫ్ గూడలోని 1వ టీఎస్ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరిగే ఈ వేడుకకు ప్రముఖు తారలతో పాటు మంత్రి కేటీఆర్ (KTR) కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడే అవకాశమున్నందున మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు విధించారు. నిర్వహకులు జారీ చేసిన ఎంట్రీ పాసులు ఉన్న వారికే లోనికి అనుమతి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోండి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసుఫ్‌గూడ వైపు వెళ్లే వాళ్ళు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి. అమీర్ పేట్ నుంచి యూసుఫ్‌గూడ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వారు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ రోడ్డు, ఇందిరా నగర్ మీదుగా వెళ్తే మంచిది. సవేరా ఫంక్షన్ హాల్, కృష్ణకాంత్-పార్క్, కల్యాణ్ నగర్, సత్యసాయి నిగామగమం, కృష్టానగర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు.
పార్కింగ్ కోసం ఏర్పాట్లు
ఎంట్రీ పాసులు పొంది ఈవెంట్‌కు వచ్చే అతిథుల కోసం సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 21నే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. పాసులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దని.. దయచేసి పాసులు లేని వారు రావొద్దని సూచించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతానికి పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ , రానా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak Pre Release Event) ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.