Hyderabad Traffic: నేడు ఈ రూట్స్‌లో అస్సలు వెళ్లకండి! ఈ మార్గాల్లో ట్రాఫిక్ బంద్ - ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Hyderabad Traffic: నేడు హైదరాబాద్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. సమావేశాలు, ర్యాలీల కారణంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad Traffic: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీఆర్ఎస్ నాయకులు ఓ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ల దీనికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి 2, 300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానీకం వస్తారని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందువల్లే భాగ్య నగరంలో ట్రాఫిక్ మళ్లింపులను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
#HYDTPinfo#TrafficAlert for General Public in view of “Telangana Jateeya Samaikyata Vajrotsavalu” programme at NTR Stadium on 17-09-2022.@JtCPTrfHyd pic.twitter.com/AOoHoLUqo4
— Hyderabad Traffic Police (@HYDTP) September 16, 2022
ట్రాఫిక్ డైవర్షన్...
కవాడిగూడ, ఆశోక్ నగర్, ముషీరాబాద్ కూడళ్ల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసలు తెలిపారు. ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ కూడళ్ల నుంచి వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నారు. రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు, కూడళ్ల వైపు వెళ్లే వాహనాలను సైతం దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ విడుదల చేశారు. నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ను సందర్భానుసారం మళ్లించనున్నట్లు చెప్పారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ వద్ద పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు.
#HYDTPinfo#TrafficAlert for the Emergency vehicles.@JtCPTrfHyd pic.twitter.com/T3ls4Bj13f
— Hyderabad Traffic Police (@HYDTP) September 16, 2022
- సివిల్ పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు.. కాస్త ముందుగానే బయలు దేరి రావాలని రంగనాథ్ సూచించారు.
సైదాబాద్ లోని పలు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు తెలిపారు. దుండిగల్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం నుండి బాలానగర్ వైపు నుంచి వాహనాలు, లిటిల్ స్టార్ పాఠశాల, అయోధ్య నగర్, కుత్బుల్లాపూర్ మీదు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. రాజేంద్రనగర్ లోని ఆరాంఘర్, అత్తాపూర్ నుంచి వచ్చే వాహనాలను.. టీఎస్పఏ సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. బెంగళూర్ నుంచి షాద్ నగర్ వైపు వచ్చే వాహనాలతో పాటు పరిగి మీదుగా జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను... 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.