Revanth Reddy: కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు, వారి విధానం అదే - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని.. ఇద్దరూ విభజించు పాలించు విధానాన్ని అవలంభిస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
మహాత్మాగాంధీ స్పూర్తితో దేశంలో, రాష్ట్రంలో విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నేడు (అక్టోబర్ 2న) గాంధీ జయంతి సందర్బంగా బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్ముడి జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ అనే విష వృక్షం దేశాన్ని కబలించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటివి ఎదుర్కొనేందుకు బాపూజీ ఎప్పుడో దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేశారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని.. ఇద్దరూ విభజించు పాలించు విధానాన్ని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఇద్దరూ తమ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకు రావాలని కోరారు.
వారి కుట్రలను తిప్పికొట్టేందుకే భారత్ జోడో యాత్ర
దేశంలో ప్రధాని మోదీ అవలంబిస్తున్న విభజించు పాలించు విధానాన్ని, రాష్ట్రంలో కేసీఆర్ కూడా అవలంభిస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇద్దరూ ప్రజల మధ్య విద్వేషపు గోడలు నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. చవకబారు నేతల విభజించు పాలించు విధానాలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ పాదయాత్రకు తెలంగాణ రాష్ట్రం తరపున సంపూర్ణంగా అండగా ఉంటామని ఆయన అన్నారు. అక్టోబర్ 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రజలంతా భారత్ జోడో యాత్రలో కదం కదం కలపాలని కోరారు.
Gandhi Ideology Centre…the brainchild of @INCTelangana at Bowenpally to preserve and promote the social ideas of the #Congress party. pic.twitter.com/d5krqYi78C
— Revanth Reddy (@revanth_anumula) October 2, 2022
మన మహాత్ముడు ప్రపంచానికే ఆదర్శం
ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన బాపూజీ అని అన్నారు రేవంత్. శాంతియుత పోరాటంలో ప్రపంచానికి ఆయన ఆదర్శంగా ఉండటం మన దేశానికే గర్వకారణమన్నారు. మర పిరంగులతో రాజ్యాలను ఏలుతున్న బ్రిటీషర్లపై శాంతియుత పోరాటం చేసిన మహనీయడు గాంధీ అని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంతో డూ ఆర్ డై అని పిలుపునిచ్చి.. దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అన్నారు. బాపూజీ స్ఫూర్తితో దేశ తొలి ప్రధాని నెహ్రూ హరిత విప్లవం తీసుకొచ్చారని... సాగు నీటిని రైతులకు అందించి దేశంలో దారిద్ర్యాన్ని పారద్రోలారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు అధికారం అందించిన శక్తి కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం రాహుల్ యాత్రకు అండగా నిలుస్తుందని, గాంధీ స్పూర్తితో మనందరం భారత్ జోడో యాత్రలో కదం కదం కలపాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.