Congress Protest: తెలంగాణలో రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం- ధర్నాచౌక్ వెళ్లకుండా నియంత్రణ
Congress Protest: తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.
Congress Protest: తెలంగాణలో సర్పంచ్‌ల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు నియంత్రించారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ఆందోళనలను భగ్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రానీయకుండా ఆంక్షలు పెట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. సర్పంచుల నిధుల సమస్యలపై హైదరాబాద్ లోని ధర్నా చౌక్ చేపట్టే ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని నేతల ఇంటి దగ్గర భారీ సిబ్బందితో పోలీసులు పహారా కాస్తున్నారు.
CM doesn’t come out of Pragati Bhavan nor common man has access to it.
— Revanth Reddy (@revanth_anumula) January 2, 2023
If we question,we face cases & house arrests.
Police surrounded my house & all important leaders to prevent from a dharna against the plight of Sarpanchs in the state.
Democracy…where are you!?#HitlerKCR pic.twitter.com/ldMfXGWNZc
ధర్నాను అడ్డుకునేందుకు నేతలను గృహ నిర్బంధం చేస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలంగాణలో ఇదో కొత్తరకం నిర్బంధం అని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హౌస్ అరెస్టుల పేరిట నేతలను అడ్డుకుంటున్నారని.. ఇది చాలా దుర్మార్గం అని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే.. సర్కారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పనితీరును క్షేత్ర స్థాయిలో ప్రజా మద్దతుతో నిలదీస్తామని హెచ్చరించారు.
సర్పంచుల నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పై టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇందిరా పార్కు వద్ద జరగాల్సిన ధర్నా కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మండల కేంద్రాల‌్లో ధర్నాలు, రాస్తారోకోలు , సీఎం దిష్టి బొమ్మల దగ్ధం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. అనుమతి లేకపోయినా ధర్నాలు, రాస్తారోకోలు జరిపి తీరుతామన్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఎవరూ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
నేతల గృహనిర్బంధంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జాము నుంచి టీపీసీసీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షులు సహా ముఖ్య నాయకులను అందరినీ గృహ నిర్బంధం చేసి అప్రజాస్వామికంగా, నియంతలాగా పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్య నేతలు, నాయకులను నిర్బంధించినా కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి కట్టుగా పని చేసి ధర్నాలను విజయవంతం చేయాలని అన్నారు. పోలీసులకు భయపడకుండా వచ్చి కాంగ్రెస్ శ్రేణులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి సూచించారు.