Actor Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు స్వల్ప ఊరట, అప్పటివరకూ అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు
Tollywood Drugs Case in Hyderabad: టాలీవుడ్ హీరో నవదీప్ కు హైకోర్టు ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ (Actor Navdeep) ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Tollywood Drugs Case in Hyderabad:
హైదరాబాద్: టాలీవుడ్ హీరో నవదీప్ కు హైకోర్టు ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ (Actor Navdeep) ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు డ్రగ్స్ కేసులో ఏ సంబంధం లేదని ముందస్తు బెయిల్ కోరుతూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సెప్టెంబర్ 19 వరకు నటుడు నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని కోర్టు శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నవదీప్ బెయిల్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదివరకే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రాగా, తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు సంబంధం ఉందని 29వ నిందితుడిగా హీరో నవదీప్ పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇదివరకే ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఆ రాంచంద్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. నవదీప్ ను కన్స్యూమర్ గా ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. దాంతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు చేర్చి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో నవదీప్ పేరు (ఏ29)ను చేర్చినట్లు సమాచారం. నటుడు నవదీప్ పరారీలో ఉన్నారని గురువారం పలు మీడియాలలో కథనాలు రాగా, తాను ఎక్కడికి పారిపోలేదని, ఈ కేసులో ఇరుక్కున్న నవదీప్ తాను కాదని స్పష్టం చేశారు. కానీ శుక్రవారం నాడు పరిస్థితి మారిపోయింది. నిందితులు తరచుగా హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఇప్పటికే ముగ్గురు నైజీరియన్ లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నోటీసులు ఇవ్వడానికి యత్నించగా అతడుగానీ, అతడి కుటుంబంగానీ అందుబాటులో లేదని, ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.
ప్రస్తుతం నవదీప్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. నవదీప్ లీడ్ రోల్ లో నటించిన 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగమ్మాయి, హీరోయిన్ బిందు మాధవి ఈ వెబ్ సిరీస్ లో కీ రోల్ ప్లే చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 త్వరలో రాబోతోంది.