Governor Tamilisai Soundararajan: గవర్నర్లు కూడా రాష్ట్రపతిలాంటి వ్యక్తులే కదా- తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై చురకలు
Governor Tamilisai Soundararajan: గవర్నర్లు కూడా రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు చురకలంటించారు గవర్నర్ తమిళిసై.
Governor Tamilisai Soundararajan: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆసక్తికకర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడి పెడుతూ మాట్లాడారు. చెన్నైలో మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని అన్నారు. అలాగే సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. తనకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోందన్నారు. రాష్ట్రపతే ప్రారంభించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని.. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని కూడా అంటున్నారని వివరించారు. రాష్ట్రపతిల మాదిరిగానే గవర్నర్లు కూడా రాజకీయేతర వ్యక్తులే కదా అని ఆమె వ్యాఖ్యానించారు.
మే 28న ప్రారంభం..
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్ సిద్ధమైపోయిందని, ఆత్మనిర్భర్ భారత్‌కి ఇది ప్రతీకగా నిలిచిపోతుందని గతవారమే లోక్‌సభ ఓ ప్రకటన చేసింది. 2020 డిసెంబర్ 10వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. అయితే...కొవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదాబాద్‌కి చెందిన HCP Design Planning and Management ఈ బిల్డింగ్‌ని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ (Bimal Patel)దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ పక్కనే Tata Projects Limited ఈ నిర్మాణాన్ని చేసింది.
పాత పార్లమెంట్‌లో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చునేందుకు వీలుండేది. అయితే..కొత్త పార్లమెంట్‌లో సీటింగ్ కెపాసిటీ పెంచారు. 888 మంది లోక్‌సభలో, 300 మంది రాజ్యసభలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం డయామీటర్ 560 అడుగులు. అది కేవలం 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. ఇప్పుడీ విస్తీర్ణాన్ని భారీగా పెంచారు. ప్రస్తుత పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ ఉంది. ఇందులోనే మీటింగ్‌లు జరిగేవి. అయితే...కొత్త పార్లమెంట్‌లో మాత్రం ఈ వసతి లేదు. లోక్‌సభ ఛాంబర్‌లోనే జాయింట్ సెషన్స్ ఏర్పాటు చేసుకునేలా మార్పులు చేర్పులు చేశారు.
ప్రారంభోత్సవానికి రామంటూ కాంగ్రెస్ సహా 19 పార్టీల లేఖలు
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఇప్పటికే విపక్షాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలు ఈ మేరకు లేఖ కూడా రాశాయి. దీనిపై కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. అయితే.. అటు విపక్షాలు మాత్రం బీజేపీపై మండి పడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీపై మండి పడ్డారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిపించకపోవడం ఆమెకు అవమానకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.