TG New Police Commissionerates: జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి 4 పోలీస్ కమిషనరేట్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి, దానిని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విభజించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణ మరియు భవిష్యత్ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పోలీస్ కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ, గతంలో ఉన్న 3 కమిషనరేట్ల స్థానంలో నాలుగు కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు
ఈ నెల 9న జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ప్రకటించిన 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే వ్యూహంలో భాగంగా, ఓఆర్ఆర్ (ORR) లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి, దానిని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విభజించిన క్రమంలో పోలీస్ వ్యవస్థను కూడా అదే స్థాయిలో బలోపేతం చేస్తున్నారు.
కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్
ఈ కొత్త విభజన ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఉనికిలోకి వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అసెంబ్లీ, సెక్రటేరియట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మరియు బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలను చేర్చారు. ఐటీ రంగానికి నిలయమైన గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు పారిశ్రామిక కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతాయి. గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలు వస్తాయి.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఇదే..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఒక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఈ సరికొత్త కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. అలాగే, ఇప్పటివరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని కమిషనరేట్ వ్యవస్థ నుంచి మినహాయించి, దానికి ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇకపై ప్రత్యేకంగా ఎస్పీ (SP) బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు నలుగురు కమిషనర్లు మరియు భువనగిరి ఎస్పీ నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమగ్ర మార్పులు నేర నియంత్రణలో మరియు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.






















