Hyderabad: ఎలక్షన్ డ్యూటీకి హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్: రొనాల్డ్ రాస్
Telangana Polls 2024: ఎన్నికల విధులకు సంబంధించి సిబ్బందిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రొనాల్డ్ రాస్ హెచ్చరించారు.
Hyderabad District Election officer Ronald Ross- హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నిఘా పెరిగింది. ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులను ఆదేశించింది. ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై చర్యలకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ (Ronald Ross) సిద్ధమయ్యారు. ఎలక్షన్ డ్యూటీకి హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
23వేల మంది సిబ్బందికి ఎలక్షన్ ట్రైనింగ్
ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 23వేల మంది సిబ్బందిని ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. కానీ వారిలో 3700 మంది ఎలక్షన్ ట్రైనింగ్‌కు హాజరు అవకపోవడంపై రొనాల్డ్ రాస్ మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడేవారని, గర్భిణిలు, ఎమర్జెన్సీ పనుల వల్ల శిక్షణకు హాజరుకాని వారిని మినహాయించి మిగతా సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. శిక్షణకు ముందుగానే ఇదే విషయాన్ని రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఈనెల 18న తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిసిందే. అదే రోజు ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సంబంధిత కార్యాలయాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో జిల్లాలో కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ సారి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈసీ నిబంధనలను అనుసరించి తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వార్తా పత్రికల్లో ప్రచురించాలని రొనాల్డ్ రాస్ సూచించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికకుగానూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.