Indiramma Indlu Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్- ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి!
Indiramma Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైనా లంచాలు అడిగితే ఫిర్యాదు చేయాలని ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. 24గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు.

Indiramma Indlu Scheme: ప్రభుత్వం పథకాలు తీసుకురావడం ఎంత ముఖ్యమో వాటిని ప్రజలకు సక్రమంగా చేరవేయడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి పథకం చేరే లోపు చాలా చేతులు మారాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కొంతమంది సిబ్బంది చేతులో చిల్లర పడనిదే పని చేయడానికి ఇష్ట పెట్టుకోరు. అలాంటి సమస్య ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చింది. చాలా ప్రాంతాల్లో అధికారులు లంచాలకు అలవాటు పడి అనుమతులు, నిధులు మంజూరుకు మొండికేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అందుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరికీ లంచాలు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్న వాళ్లెవరూ పైసా లంచంగా ఇవ్వొద్దని సూచించారు. ఎలా ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలని చెప్పారు. 18005995991 నెంబర్‌కు ఫోన్ చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే లంచాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రతి శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఆ వారంలో ఎదురైన సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇండ్ల నిర్మాణ అడ్డంకులు తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి వెంటనే ఆదేశాలు ఇస్తున్నారు.
వారంవారం మాదిరిగానే శుక్రవారం సమావేశమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. పేదల ఇళ్ల నిర్మాణంలో లంచాలు దండుకోవడం ఏంటని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు సిబ్బందిపై చర్యలు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డబ్బులకు కక్కుర్తి పడ్డ కమిటీ సభ్యులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సూర్యపేట, జనగామ జిల్లాల్లో లంచాలు డిమాండ్ చేసిన వారిపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇందిరమ్మ లబ్ధిదారుల కాని వారి ఖాతాల్లో నిధులు మంజూరు
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పనులు జరిగిన స్థితిని బట్టి డబ్బులు మంజూరు చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి నిధులు విడుదల చేసేందుకు సిఫార్సు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు కాని వారి ఖాతాల్లో కూడా నిధులు చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురి ఖాతాల్లో ఆర్థిక సాయం పడింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి ఈ అక్రమాలకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ నిధులు అప్పులు కింద జమ చేసుకుంటున్న బ్యాంకులపై కూడా నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. చర్యలకు సూచనలు చేశారు.
చాలా మంది ఖాతాలు ఆధార్‌తో సీడింగ్ కాలేదు. అలాంటి ఖాతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వెంటనే ప్రక్రియను పూర్తి వారి ఖాతాల్లో దసరా లోపు నగదు జమ చేయాలని చెప్పారు. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని లాగ్ చేయొద్దని హితవులు పలికారు.





















