Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రో పనులపై సీఎం కేసీఆర్ ఫోకస్ - త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Hyderabad Old City Metro: హైదరాబాద్ ప్రజలంతా ఎప్పుడెప్పుడూ అని వేచి చూస్తున్న పాతబస్తీ మెట్రో త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ చైర్మన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఎంజీబీఎస్ - ఫలక్ నుమా మార్గాల మధ్య పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. మెట్రో రైలు తొలి విడత కింద 69.2 కిలో మీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులు ఎత్తేసింది. రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలో మీటర్లు అదనంగా నిర్మిస్తే ఈ మార్గం పూర్తి అవుతుంది. అలాగే నిలిచిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7కిలో మీటర్లు పూర్తి అవుతుంది.
Hon’ble CM KCR has instructed the Municipal Administration department to take forward the Metro project in Old city of Hyderabad
— KTR (@KTRBRS) July 10, 2023
He also spoke to Chairman of L&T which is the agency executing the Metro Rail Project to expeditiously take up the project and promised all needed…
హైదరాబాద్ మెట్రో రైలును పొడిగించాలన్నది పాతబస్తీ వాసుల చిరకాల డిమాండ్. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనేక బహిరంగ ప్రసంగాలలో ఈ విషయాన్ని తెలిపారు. అయితే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చూసి ఆయన స్పందించారు. పాతబస్తీ ప్రజలు దీని కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారని చెబుతూ రీట్వీట్ చేశారు. ఇది కచ్చితంగా పాతబస్తీ ప్రజలకు సహాయం చేస్తుందని మరింత పర్యాటకాన్ని కూడా తీసుకు వస్తుందని వివరించారు. గత నెలలో రెండు వేర్వేరు ప్రసంగాల్లో పటాన్చెరు, కందకూరు వరకు మెట్రోను పొడిగిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో పాతబస్తీ వరకు మెట్రో రైలు సేవలను పొడిగించేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఆరు సంవత్సరాలుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మార్గం నిలిచిపోయింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే మార్గాన్ని మళ్లించేందుకు సర్వే నిర్వహించినా ముందడుగు పడలేదు.
Welcome this announcement by @KTRBRS. The people of Hyderabad’s Old City have been waiting for public transport connectivity for a long time. This will definitely help people of Old City & also bring in more tourism. https://t.co/BK3Cr6WwNX
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2023