నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించి.. కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన వాళ్లు ఇప్పుడు దొంగా దొంగా అంటూ అరుస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంబరాలు చేసుకున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టు తీర్పు బీజేపీ విజయం అంటూ సందడి చేయడం వెనుక ఉన్న మర్మం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్లంతా... కేసును సీబీఐకి అప్పగిస్తే ఎందుకంత ఆనందమో చెప్పాలని ప్రశ్నించారు. ఆనాడు భుజాలు తడుముకున్న వాళ్లు.. ఇవాళ ఆ నిందితులను భుజాలపై ఎందుకు మోస్తున్నారని నిలదీశారు. అసలు సంబంధం లేదంటూనే కోర్టుల్లో కేసులు ఎందుకు వేశారని... సీబీఐకి అప్పగించేంత వరకు ఎందుకు పోరాడారని అడిగారు. కేసు సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు రాగానే ఎందుకంత సంబరపడిపోయారని ప్రశ్నించారు.
పంజరంలో చిలుక సీబీఐకి కేసు అప్పగించగానే సంతోషం పట్టలేకపోతున్నారా అని కిషన్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. మీ జేబు సంస్థకు కేసు చిక్కిందనా ఈ ఆనందం అంటూ ప్రశ్నలు సంధించారు. కేసు సీబీఐకి వెళితే మీ 'బారా ఖూన్ మాఫ్' చేసి క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని మాట్లాడుతారా? దర్యాప్తు సంస్థలన్నింటినీ నాశనం చేసిన తీరుకు ఈ ప్రకటనలే సాక్ష్యమని అన్నారు. ఒకప్పుడు సీబీఐకి కేసులు వెళ్తే నిందితులు వణికిపోయేవాళ్లని... ఇప్పుడు హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టే ఆ దర్యాప్తు సంస్థలను బీజేపీ ఎంతగా గుప్పెట్లో పెట్టుకొని నీరుగార్చారో అర్ధమవుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించి.. కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన వాళ్లు ఇప్పుడు దొంగా దొంగా అంటూ అరుస్తున్నారని కేటీఆర్ దుమ్మెత్తి పోశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేయడంలో బీజేపీ కాంగ్రెస్‌ను మించిపోయిందన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని విమర్శఇంచేవాళ్లని... ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నిందితులపై సీబీఐ దర్యాప్తుతోపాటు నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇలా చేస్తే బీజేపీతో వాళ్లకు ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయన్నారు కేటీఆర్. దమ్ముంటే ఈ సవాల్‌కు సిద్దపడాలన్నారు.
కిషన్ రెడ్డి గారూ! మీకో సూటి ప్రశ్న.
— KTR (@KTRTRS) December 27, 2022
ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు…ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు?
మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే.. మీ వెన్నులో వణుకు మొదలైంది
అప్పుడు భుజాలు తడుముకున్న మీరు.. ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు?
బీజేపీ ఎప్పుడో ప్రజల్లో బద్నాం అయిందని... ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏమీ లేదన్నారు కేటీఆర్. వాళ్ల దగ్గర విషయం లేకే... ప్రత్యర్థులను కేసులు, దర్యాప్తు సంస్థల పేరుతో బెదిరించి విషయ ప్రయోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను అంగడి సరకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నా మాట వాస్తం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నం చేసే అడ్డంగా దొరికిపోయారన్నారు. ఇక్కడ ఆపరేషన్ లోటస్ బెడిసి కొట్టిందని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి... దొంగలకు సద్దులు మోసిన బీజేపీ నేతలు... ఇప్పుడు తెలంగాణలో సుద్దులు చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారి చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో నిజమైన ప్రజా విచారణ ఎప్పుడో ప్రారంభమైందన్న కేసీఆర్... ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.