KTR About Congress 6 Guarantees: కల్లబొల్లి గ్యారెంటీలు ఇక్కడ చెల్లవ్, కాంగ్రెస్ 6 హామీలపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదీ
KTR Responds on Congress 6 Guarantees for Telangana: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల కల్లబొల్లి గ్యారంటీలు అని, తెలంగాణలో ఇవి చెల్లవు అని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
KTR Responds on Congress 6 Guarantees for Telangana:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును తన స్వప్నం అని పేర్కొన్న సోనియా గాంధీ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన సభలో 6 గ్యారంటీలను ప్రకటించారు. విజయభేరి సభలో మహాలక్ష్మి, యువత వికాసం, ఇందిరమ్మ ఇండ్లు అని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల కల్లబొల్లి గ్యారంటీలు అని, తెలంగాణలో ఇవి చెల్లవు అని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని విమర్శించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
రాబందుల రాజ్యమొస్తే (కాంగ్రెస్ అధికారంలోకి వస్తే) రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు తప్పవని.. కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే, ఇక రాష్ట్రంలో మూడు గంటల కరెంటే గతి..
ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అన్నారు. దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ. బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా.. ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల గ్యారంటీలను నమ్మవద్దని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ అని, ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అంటూ మండిపడ్డారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే, సంపదనంతా స్వాహా చేస్తారు. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే మనకు బూడిద మిగలడం గ్యారెంటీ అన్నారు.
స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని గ్యారంటీగా ఎత్తేస్తారు. కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ అన్నారు. పరిపాలన చేతగాని.. చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం ఖాయమన్నారు కేటీఆర్. పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ అని, బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. విషయం, విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం అవుతాం. థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే అగ్ర స్థానంలో వున్న తెలంగాణ అధమస్థాయికి పడిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఆర్థిక వ్యవస్థ ఏట్లో కలుస్తుందన్నారు. జోకర్లకు.. బ్రోకర్లకు పీఠం ఇస్తే
పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం ఖాయమన్నారు. దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు నా తెలంగాణ. ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణను ప్రేమించినట్లయితే ఉద్యమంలో అంత మంది ప్రాణాలు కోల్పోయే వరకు కాంగ్రెస్ ఎదురుచూసేది కాదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో రాహుల్ గాంధీ హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సీఎం అభ్యర్థిని ప్రకటించినా.. ఆ నేత తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తారని, హైకమాండ్ ఆదేశాలతో పనిచేయరని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నేతలే సొంతంగా నిర్ణయాలు తీసుకుని పాలిస్తారని సోనియా గాంధీ ఇవ్వలేరు కదా అంటూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కొత్తగా నియమించిన CWC లో తెలంగాణకు చెందిన నేతలకు స్థానం దక్కలేదని, ఇది పార్టీలో రాష్ట్ర నేతలకు దక్కిన గౌరవం అని సెటైర్లు వేస్తున్నారు.