Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Telangana Weather: గురువారం కురిసిన వర్షానికే తెలంగాణ ఆగమాగమైంది. అదే పరిస్థితి ఇవాళ రేపు కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఉపరితల చక్రవాత ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో గాలి వాన కుమ్మేసింది. ఉరుములు, మెరుపులతో ప్రజలను హడలెత్తించింది. ఇవాళ , రేపు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఆ టైంలో బయటకు రావద్దని హితవుచెబుతున్నారు.
తెలంగాణలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ మంటపుట్టించింది. తర్వాత నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైపోయింది. గాలులు, జల్లులతో మొదలైన వరుణుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇలాంటి వాతావరణమే కనిపించింది.
మధ్యాహ్ననం 3 గంటల నుంచి కురిసిన వర్షం రాత్రి వరకు పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో జనం తిరగడానికి ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్లు బైక్‌లు నీట మునిగాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. తెలంగాణవ్యాప్తంగా వర్షపాతాలు చూసుకుంటే... యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.78 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం రిజిస్టర్ అయింది. తర్వాత హైదరాబాద్ జిల్లా హిమాయత్‌నగర్‌లో 9.10 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 9 సెంటీమీటర్ల వాన కురిసింది.
అకాల వర్షంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఈ రోజుల్లో నమోదు అయ్యే ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే దాదాపు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అత్యధిక ఉష్ణోగ్రత 39.8 డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్‌లోనే నమోదు అయింది. అతి తక్కువ ఉష్ణోగ్రత కూడా 21.7 డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్‌లోనే రిజిస్టర్ అయ్యింది.
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :03-04-2025 pic.twitter.com/C0iexM6GiU
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 3, 2025
ఇవాళ్టి వాతావరణం
శుక్రవారం శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మాల్కజిగిరి, యాదద్రి భువనగిరి, మహాబుబ్‌నగర్ , సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో వడగళ్ల వాన పడనుంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెదపల్లి, నల్గొండ, ఆదిలాబాద్, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్, సుర్యాపేట్, మహాబుబాబాద్, హాన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం కురిసిన వర్షాలకు నలుగురు మృతి
గురువారం కురిసిన పిడుగుల వానకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నలుగురు చనిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర శివారులో వ్యవసాయ పనులకు వెళ్లిన సుంకరి సైదమ్మ(45) గాజుల వీరమ్మ(55) చనిపోయారు. గాయపడిన మరోమహిళను ఆసుపత్రిలో చేర్చారు. గద్వాల జిల్లా చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) పిడుగు పడి మృతి చెందాడు. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సకు చెందిన మహేంద్ర(21) పిడుగుపాటు చనిపోయాడు. మరికొన్ని జిల్లాల్లో పిడుగులు పడి పశువులు మృతి చెందాయి.





















