Investment Fraud: పీలేరు వేదికగా సైబర్ ఫ్రాడ్- 30 మంది యువతులతో భారీ మోసం-పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
Investment Fraud: షేర్ మార్కెటింగ్ అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Investment Fraud: సైబర్ నేరాలు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి. తమకు ఎవరూ పట్టుకోలేరనే ఉద్దేశంతో చిన్నపట్టణాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అమాయకులను దోచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మకాం వేసి సుమారు 140 మంది వద్ద రూ.కోటికిపైగా మోసం చేసిన సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
షేర్ మార్కెటింగ్ అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్ నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్ర వివరాలను తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన తిప్పనగారి సాయి శరన్ కుమార్ రెడ్డి ఇంటిగేర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమెటెడ్ పేరుతో పీలేరులో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ 38 మంది మహిళా టెలీకాలర్స్‌తో ఒక కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
సెబీలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా.. ఎలాంటి అర్హత లేకున్నా తాము ట్రేడింగ్ అడ్వయిజరీ చేస్తామంటూ కాల్సెంటర్ నుంచి టెలీకాలర్స్ ఫోన్లు చేస్తుంటారు. ఇందులో ఫ్లోర్ మేనేజర్లుగా కొంతోళ్ల మహేశ్, రెడ్డివారి హరిబాబు యాదవ్, టీమ్ లీడర్లుగా కొర్రు అజిత్, దివాకర్ పనిచేస్తున్నారు. ట్రేడింగ్‌లో లాభాలు వచ్చేలా చేస్తామనంటూ నమ్మిస్తూ వారి డేటాను సేకరిస్తున్నారు. ఆ తరువాత డిమాట్ ఖాతా, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి, వాటిలోని డబ్బును ఇతర ఖాతాలకు మళ్లిస్తారు. తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు.
ఇలా బయటపడింది..
హైదరాబాద్‌కు చెందిన నగరానికి చెందిన ఓ బాధితుడు ఈ ముఠా మాటలు నమ్మి రూ.2.6 లక్షలు మోసపోయాడు. దీంతో బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్నమయ్య జిల్లా పీలేరులోని కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ హరిభూషణ్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ మోసానికి సంబంధించిన తీగను లాగడంతో ఈ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
31 ల్యాప్‌టాపులు, ఆరు మొబైళ్లు స్వాధీనం
నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు ఫోన్లు, 31 ల్యాప్‌టాపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాయి శరన్ కుమార్ రెడ్డి, మహేశ్, రెడ్డివారి హరిబాబు యాదవ్, కొర్రు అజిత్, దివాకర్ పై ఐటీ చట్టం సెక్షన్లు 66 సీ అండ్ డీ, ఐపీసీ సెక్షన్ 419, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 140 మంది నుంచి రూ.1.08 కోట్ల వరకు ఈ ముఠా మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని డీసీపీ వివరించారు. ఈ ముఠా ఎనిమిది నెలలుగా మోసాలకు పాల్పడుతోందన్నారు. నమ్మకంగా కనిపించేందుకు ఒక ఫేక్ వెబ్‌సైట్‌ను ఈ ముఠా నిర్వహిస్తోందని డీసీపీ తెలిపారు. ఎవరైనా టిప్స్, ఈజీ మనీ కోసం సైబర్ నేరాగాళ్ల ట్రాప్‌లో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు సంబంధిత వివరాలు, ఓటీపీ ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.