Rape Accused Death Updates: రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం.. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశం
పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.
సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన పల్లకొండ రాజు మృతిపై హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశించింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. లైంగిక దాడి, బాలిక హత్య కేసులో నిందితుడు రాజు చనిపోవడంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు రాజును హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదించారు. అయితే, అతణ్ని హత్య చేయలేదని రాజు ఆత్మహత్య చేసుకున్నాడని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని చెప్పారు. రాజు శవానికి పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని తెలిపారు. పోస్టు మార్టం వీడియోలు వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ వీడియోలు రేపు (సెప్టెంబరు 18) రాత్రి 8 గంటల్లోగా జిల్లా జడ్జికి అప్పగించాలని నిర్దేశించింది.
Must Watch: నిజాం లొంగుబాటు.. 1948లోని వార్తలు ఎక్స్‌క్లూజివ్‌గా.. ఆ రోజు పత్రికల్లో ఏం వచ్చింది?
రాజు మరణంపై అనుమానాలు
నిందితుడు రాజుది కస్టోడియల్ మృతిగా పలువురు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ లక్ష్మన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో రాజును పట్టుకుని చంపేసి.. రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆరేళ్ల బాలిక హత్యాచారం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు గాలించారు. నిందితుడి ఆచూకీ చెప్తే ఏకంగా రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు.
Also Read: నా వయసు మోదీ, అమిత్ షాకు ట్రాన్స్‌ఫర్ చేయాలని అమ్మవారికి మొక్కుకున్నా: బండి సంజయ్