MLA Raja Singh: రాజాసింగ్ కేసులో సర్కార్‌పై హైకోర్టు సీరియస్, ఈసారి నోటీసులిస్తామని హెచ్చరిక
ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.
హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్ పైన పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయగా, అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు (అక్టోబరు 20) విచారణ జరిగింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణం చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు మరోసారి ఆదేశించింది. ఈ పిటిషన్ తర్వాతి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయలేకపోతే నోటీసులు ఇస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. తర్వాతి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
కొద్ది వారాల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా గతంలో ఓ సందర్భంలో తెలిపారు.
ఓ మతం, లేదా వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని సీపీ వివరణ ఇచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్ పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంతేకాక 18 కమ్యూనల్ (మతపరమైన) కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు.
గతంలోనే హైకోర్టు హెచ్చరిక
రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాకలు చేయకపోవడంపై హైకోర్టు పది రోజుల క్రితమే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా రెండోసారి. రాజాసింగ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి నాలుగు వారాలు గడుస్తున్నా స్పందించకపోవడంపై పది రోజుల క్రితమే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. మరో రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ కేసు విషయంలో ఇప్పటికే పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తైందని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. బోర్డ్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని వివరించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది వివరణ విన్న హైకోర్టు.. ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై కౌంటర్ దాఖలు గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కచ్చితంగా ఆ తేదీలోపు స్పందించాలని సూచించింది.
తప్పు చేయలేదన్న రాజాసింగ్
మరోవైపు, తాను ఎలాంటి తప్పు చేయలేదని అధిష్ఠానానికి గతంలోనే వివరణ ఇచ్చారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎప్పుడో సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అరెస్ట్ కావడంతో ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పటికీ రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే ఆయన పీడీ యాక్ట్ అడ్వయిజరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో రాజాసింగ్ బీజేపీ హైకమాండ్‌కు తన వివరణ పంపించారు. జైలు నుంచే ఈ లేఖ పంపినట్లుగా అటెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తానెక్కడ పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని.. ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.