MLA Raja Singh:శ్రీరాముడు, గోమాత వల్లే విడుదలయ్యా - రిలీజయ్యాక ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడి
BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా... ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. శ్రీరాముని దయ వల్లే బయటకు వచ్చానంటూ కామెంట్లు చేశారు.
BJP MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బుధవారం రోజు చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎలాంటి రెట్టగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించ వద్దని కూడా షరతు విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.
బుధవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయగానే రాజాసింగ్ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్ ఆర్డర్ ఆన్ లైన్ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్ ను విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ ప్రజలకు అభివాదం చేస్తూ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజసింగ్ అనుచరులు, అభిమానులు ర్యాలీ తీసేందుకు విఫల యత్నం చేశారు. బాణాసంచా పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు ఎవరూ గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీరాముడి దయ వల్లే క్షేమంగా బయటకొచ్చా..
అయితే కారులో వెళ్తున్న రాజాసింగ్ ను చూసిన అభిమానులు జైశ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజాసింగ్ విడుదలతో మంగళ్ హాట్ లోని రాజాసింగ్ ఇంటి వద్ద ఆయన బంధువులు, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదం వల్లే తాను క్షేమంగా బయటకు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. తన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు వివరించారు.
धर्म की विजय हुई।
— Raja Singh (@TigerRajaSingh) November 9, 2022
एक बार पुनः आपकी सेवा में उपस्थित होगया हु।
जय श्री राम 🚩 pic.twitter.com/UM2LcpxuMu
నేడో.... రేపో సస్పెన్షన్‌ను ఎత్తి వేయనున్న బీజేపీ
రాజాసింగ్‌ను ఆయన సొంత పార్టీ బీజేపీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించకుండా ఉండటానికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాజాసింగ్ జైలు నుంచే వివరమ పంపారు. దీంతో రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ప్రజలు, హిందుత్వవాదులు, పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనకు హైకోర్టు పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం ప్రకటించడంతో రేపో మాపో బీజేపీ తన సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.