Artificial Intelligence City : నాడు హైదరాబాద్- నేడు సైబరాబాద్- రేపు ఏఐ సిటీ
Artificial Intelligence City In Telangana : తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాన్ని నిర్మించబోతున్నట్టు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం తెలియజేసింది. 50-100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామంది.
Artificial Intelligence City : తెలంగాణ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై టీజర్ లాంటి అప్‌డేట్స్ ఇచ్చారు. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులను తన ప్రసంగంలో తమిళిసై వివరణ ఇచ్చారు. అలాంటి వాటిలో ముఖ్యమైంది ఏఐ సిటీ.
ఉమ్మడి రాష్ట్రంలో 1990 వరకు హైదరాబాద్ అంటేనే ఛార్మినార్, గోల్కొండ వంటి చారిత్రాత్మక కట్టడాలు గుర్తుకు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు హయాంలో ఐటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రత్యేక సిటీ రూపాంతరం చెందింది. దాన్ని సైబరాబాద్‌గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా హైదరాబాద్ లో మరో సరికొత్త నగరం ఆవిష్కృతమైంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తూ వచ్చారు.
సైబరాబాద్ విస్తరిస్తూనే ఉంది. మారుతున్న టెక్నాలజీతోపాటు నగర పరిధి కూడా మారాల్సి వచ్చింది. అందుకే దీన్ని మరింతగా విస్తరించి సరికొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించినట్టు గవర్నర్ తన ప్రసంగంలో తెలియజేశారు. గవర్నర్ ప్రసంగంలో ఏమన్నారంటే..." నా ప్రభుత్వం కొత్త సాంకేతికతను ముఖ్యంగా కృత్రిమ మేధా శక్తిని వినియోగించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది. ప్రపంచ అగ్రగామి సంస్థలు, అలాగే జాతీయ సాంకేతిక కంపెనీలను తమ కృత్రిమ మేధా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం ద్వారా దేశంలోనే హైదరాబాద్‌ను, తెలంగాణను కృత్రిమ మేధస్సుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ది చేస్తాం. మా ప్రభుత్వం కృత్రిమ మేధా సిటీని 50-100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుంది.
అంతకు ముందు మాట్లాడుతూ... నేడు మన సమాజంలో డిజిటల్ అనుసరణ శరవేగంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం డిజిటల్ అవకాశాల నుంచి పూర్తిగా ప్రయోజనం పొందడమే కాకుండా కొత్త సాంకేతికతలలో దేశంలోనే అగ్రగామిగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇంటర్నెట్‌ను ఒక ప్రాథమిక హక్కుగా ప్రవేశ పెట్టడం అనేది, మా ప్రభుత్వం చేపట్టబోయే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. కేవలం డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడమే కాకుండా సమాజంలోని అనని వర్గాలకు కనీస ధరలకే అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టబోతున్నాం. ప్రతి కుటుంబం వేగవంతమైన డిజిటల్ అనుసరణ అవకాశాల ద్వారా వచ్చే ప్రయోజనం పొందేందుకు ఒక సార్వజనీన సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుంది అని అన్నారు.