TS Lands Auction : తెలంగాణ సర్కార్‌కు జాక్ పాట్ - అక్కడ భూముల వేలంలో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?
భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. తాజాగా వేసిన వేలంతో రూ. 200 కోట్ల వరకూ సమకూరినట్లుగా తెలుస్తోంది.
TS Lands Auction : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి జాక్ పాట్ తగిలినట్లయింది. హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయడంతో వందల కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడ్డారు. అత్యధికంగా గజం రూ.1.11 లక్షల ధర పలికినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్ -మలాజిగిరి జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో రెండు ల్యాండ్ పార్సిల్స్ కలిపి మొత్తం 9 చోట్ల భూములను విక్రయించడం ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భూములకు హెచ్‌ఎండీఏ నిర్ణయించిన రూ.రూ.146 కోట్ల అప్‌సెట్ ధర మేరకు ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. మొత్తం 32,730 చదరపు గజాల స్థలాలకు రూ.195.24 కోట్ల ఆదాయం సమకూరింది. రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడ, గండిపేట, కోకాపేటలో వేలం నిర్వహించగా, కోకాపేటలోని 1,852 గజాల భూమికి అత్యధికంగా గజం రూ.1.11లక్షలు పలికిందని సమాచారం. మేడ్చల్ జిల్లా పరిధిలోని మూసాపేటలో 4,840 గజాలకు సుమారు రూ.35 కోట్లు మేర ధర పలికినట్టు అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించిన ఆన్‌లైన్ వేలం పోటాపోటీగా జరిగింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 12,584 చదరపు గజాలు, మేడ్చల్-మల్కాజిగిరిలో 12,160 చదరపు గజాలు, సంగారెడ్డిలో 7,986 చదరపు గజాలు భూమిని ఈ వేలంలో విక్రయించారు.
ఇంతకు ముందు కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. గరిష్టంగా ఒక ఎకరాకు రూ.60.2 కోట్ల ధర పలికింది. రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరం భూమి కొనుగోలు చేసిది. వేలంపాటలో అత్యధిక ధర పెట్టిన కొనుగోలు చేసిన కంపెనీ ఆక్వా స్పేస్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పదహారున్నర ఎకరాలను సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సత్యనారాయణరెడ్డి మన్నె దాదాపుగా ఎనిమిది ఎకరాలు సొంతం చేసుకున్నారు. ప్రెస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏడున్నర ఎకరాలు.. ఇక శ్రీ చైతన్యకు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడున్నర ఎకరాలు కొనుగోలు చేసింది. హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరం స్థలాన్ని దక్కించుకుంది. దాదాపుగా పదిహేడు ఎకరాలు కొన్న అక్వా స్పేస్ సంస్థ మైహోం గ్రూప్‌నకు చెందినది. ఎకరం కొన్న హైమా డెవలపర్స్ కూడా వారిదే. మొత్తంగా రూ. ఐదు వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం భూముల వేలం వేస్తోంది.
రెండో దశ ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ సారి కూడా భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడే అవకాశం ఉంది. స్థలాలన్నీ సామాన్యులు కొనుగోలు చేసేంత చిన్నవి కావు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. అందుకే వాటికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి.