Telangana : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్- మూడు నెలల్లో ప్రక్రియ ప్రారంభం
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మూడు నెలల్లో నిర్మాణ ప్రక్రియ ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది.
Hyderabad News: తెలంగాణలో మరో పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ కారణంగా ముందు కదలని ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసి ప్రజల కళ్లల్లో సంతోషాన్ని నింపాలని భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పేదలకు ఇల్లు ఒకటి. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు వాటి దుమ్ముదులిపే పనిలో పడ్డారు అధికారులు
ఇళ్ల కోసం 83 లక్షల దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్లు కావాలని అభ్యర్థిస్తూ 83 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని ఇప్పటి వరకు స్క్రూట్నీ చేయలేదు. ఇప్పుడు వాటిని వడపోసి అసలైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారు. ఓవైపు ఈ ప్రక్రియ సాగుతుండగానే మరో వైపు అసలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై అధ్యయనం ప్రారంబిస్తున్నారు.
7740 కోట్లు కేటాయింపు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలిక బడ్జెట్‌లో కూడా దీనికి నిధులు కేటాయించింది. ఈ పథకం కోసం 7740 కోట్లు కేటాయించారు. అంతే కాకుండా ఈ పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ప్రారంభించారు. ఈ పథకానికి హడ్కో వెయ్యికోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుక సాగలేదు. ఇప్పుడు వాటిని జెట్‌స్పీడ్‌తో పూర్తి చేయాలని భావిస్తున్నరు.
సరికొత్త మోడల్
వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలు పరిశీలించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణం, వాటి కోసం చెల్లిస్తున్న నిధులు అన్నింటిపై అధ్యయనం చేసి ఓ సరికొత్త మోడల్‌ను తయారు చేయనున్నారు. దాని ప్రకారం పథకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.
ఏడాదికి నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన. దానికి తగ్గట్టుగానే నిధులు కేటాయిస్తోంది. ఐదేళ్లలో ఇరవై లక్షలకుపైగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్లాన్. ఒక్కో నియోజకవర్గానికి ఒక ఏడాదిలో 3500 ఇళ్లు నిర్మించనున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తే వివాదాలు లేకుండా ప్రక్రియ పూర్తి చేయవచ్చనే ాలోచన ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి లబ్ధిదారులను ఎంపిక, ఇటు ఇళ్లపై అధ్యయనం అన్నీ మూడు నెలల్లో పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిశ్చయించింది ప్రభుత్వం.