Telangana Formation: ట్యాంక్ బండ్‌పై స్టాల్స్ రేపటి నుంచే, ఇక రెండ్రోజులు ఎంజాయ్
Telangana News: జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేయిస్తున్నట్లుగా సీఎస్ వెల్లడించారు. ఆ స్టాళ్లతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని ఆమె చెప్పారు.
![Telangana Formation: ట్యాంక్ బండ్‌పై స్టాల్స్ రేపటి నుంచే, ఇక రెండ్రోజులు ఎంజాయ్ Telangana Formation day celebrations stall to be setup from June 1st on tank bund says CS santhi kumari Telangana Formation: ట్యాంక్ బండ్‌పై స్టాల్స్ రేపటి నుంచే, ఇక రెండ్రోజులు ఎంజాయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/dcf776b2691a61b0b66fda144c6255841717170760966234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Formation Decade Celebrations: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా వేడుకలు జరిపిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏర్పాట్లను పరేడ్ గ్రౌండ్స్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేయిస్తున్నట్లుగా చెప్పారు. ఆ స్టాళ్లతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని సీఎస్ చెప్పారు.
ట్యాంక్ బండ్ పై ఈ వేడుకలు జూన్ 2న రాత్రి 11 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై వెలుగులు విరజిమ్మేలా టపాకాయలు కాల్చుతారని, కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీఎస్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాలకు (సెల్ఫ్ హెల్స్ గ్రూప్) చెందిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇంకా నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు, పిల్లలు ఆడుకోవడం కోసం ప్లేయింగ్ జోన్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుందని వెల్లడించారు. లేజర్ షోతో పాటు 5 వేల మంది ట్రైనీ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని సీఎస్ తెలిపారు.
జూన్ 2 ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీకి సన్మానంతో పాటుగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ చెప్పారు. మరోవైపు, పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొనడం కోసం ఉద్యమకారులతో సహా రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపారు. ప్రోటోకాల్ అడ్వైజర్ ద్వారా రేవంత్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు అందించారు. అయితే, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)