HYDRA: చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
HYDRA: హైడ్రా పనితీరును హైకోర్టు అభినందించింది. నగరంలో చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోందంటూ కితాబిచ్చారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి.

HYDRA: విమర్శలు, నిరసనలు, తీవ్ర స్దాయిలో బాధితుల ఆందోళనలు, ప్రభుత్వంపై ఊహించని స్దాయిలో వ్యతిరేకత...ఇలా హైడ్రా ఏర్పాటైన తొలిరోజుల్లో ప్రజావ్యతిరేకత గట్టిగానే కనిపించింది. ఈ సర్కార్‌కు ఇవే చివరి రోజులు అన్నట్లుగా హైడ్రా పనితీరు, నిర్మొహమాటంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, సెలబ్రెటీల చెర నుంచి సైతం ప్రభుత్వ స్దలాన్ని స్వాధీనం చేసుకోవడం.. ఒకటేమిటి ఒక్కమాటలో చెప్పాలంటే హైడ్రా అంటేనే నిత్యం విమర్శలు, ప్రజాగ్రహానికి నిలువెత్తు బుల్డోజర్.
ఇలా భగ్గుమన్న ఆగ్రహజ్వాలలో రగులుతూ చెరువుల పురనరుద్దరణే ధ్యేయంగా ముందుకు సాగిన హైడ్రా, వరుస కూల్చివేతలు, ఆక్రమణ చెర నుంచి చెరువులను, కుంటలను రక్షించడమేకాదు, కబ్జాకోరల్లో చిక్కుకున్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను సైతం స్వాధీనం చేసుకుంటున్న తీరు తాాాజా హైకోర్ట న్యాయమూర్తిని సైతం మెప్పించింది. నగరంలో చెరువుల పునరుద్దరణపై హైడ్రా తీసుకుంటున్న చొరవను కొనియాడారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి. ఇలా ఊహించని స్దాయిలో ప్రశంసలు అందుకుంటోంది హైడ్రా. గతంలో ఎన్నడూ ,మరే ఇతర వ్యవస్ద పనిచేయనంతగా హైడ్రా చెరువుల రక్షణలో దూసుకుపోతూ, న్యాయమూర్తుల మనసులను సైతం దోచుకుంటోంది.
ఇటీవల హైడ్రా ఆక్రమణ కోరల నుంచి రక్షించి, అత్యంత సుందరంగా అభివృద్ది చేసిన బతుకమ్మకుంట చెరువును చూస్తే ముచ్చటేస్తోందన్నారు హైకోర్టు న్యాయమూర్తి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది ధర్మాసనం. హైడ్రా పనితీరుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని పేర్కొంది. ఆక్రమణలకు గురై చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో అటువైపు చూడాలంటే భయంగా ఉన్న బతుకమ్మకుంట ప్రాంతాన్ని చూడముట్టైన చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హర్షణీయన్నారు న్యాయమూర్తి.బతుకమ్మకుంట సర్వాంగ సుందరంగా మారి, ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోందని, స్దానికంగా వరద ముంపు నుంచి రక్షించడమే కాకుండా, భూగర్భ జలాలను కూడా పెంచింది.
గచ్చిబౌలిలోని మల్కం చెరువు సైతం ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. నగరంలో ఇలాగే మరో 5 చెరువుల అభివృద్ధి జరుగుతోందన్నారు. అయితే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎవరివైనా ఇంటి స్థలాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని హైడ్రాకు ,ప్రభుత్వానిక సూచించింది ధర్మాసనం. ప్రభుత్వం దీనికోసం సరైన విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే, చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఏర్పడదని తెలిపారు. టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీధర్ కూడా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఏకీభవించారు. ఈ సందర్భంగా తమ్మిడికుంటలో భూములు కోల్పోయిన వారికి సరైన టీడీఆర్ అందించాలంటూ ప్రభుత్వానికి సూచించారు. ఇలా హైకోర్టు న్యాయమూర్తి ప్రశంసలు హైడ్రాలో కొత్త జోొష్ నింపాయి. సెలవు రోజుల్లో సైతం కూల్చివేతలు ఇప్పటికీ కొనసాగించడడంతో, కోర్టుల నుంచి ఎప్పుడు, ఎటువంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందోననే ఆందోళనలో ఉన్న హైడ్రాకు న్యాయమూర్తి అభినందనలు ,నగరంలో మరిన్న చెరువుల పునరుద్దరణకు మంచి ఊతమిచ్చాయి. ఒకప్పుడు హైడ్రాను రద్దు చేయాలంటూ పిటీషన్లు దాఖలైన హైకోర్టు నుంచి శభాష్ హైడ్రా అనిపించుకునే స్దాయికి చేరడంపై సర్వత్రా హర్షం వక్తమవుతోంది.





















