Rain Fall in Hyderabad: హైదరాబాద్‌లో రికార్డుస్థాయి వర్షపాతం! వారంలో 300 శాతంగా రికార్డు
Record Rain Fall in Hyderabad: హైదరాబాద్ నగరం మీద వరుణుడు పగబట్టాడా అన్నట్లు..నగరాన్ని వరదలు ముంచెతుత్తున్నాయి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా వర్షం విపరీతంగా కురుస్తుంది.
హైదరాబాద్ నగరం మీద వరుణుడు పగబట్టాడా అన్నట్లు.. నగరాన్ని వరదలు ముంచెతుత్తున్నాయి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా వర్షం విపరీతంగా కురుస్తుంది. దీంతో నగర వాసులు తడిసి ముద్దవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించింది. జులై 24న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురిసినట్లేనని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఈ వారం రోజులుగా దాదాపు 300 శాతం అధిక వర్ష పాతం నమోదైంది. అది కేవలం వారం రోజుల్లో మాత్రమేనని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల వల్ల నగరంలో వర్షపాతం సాధారణ స్థాయి 260.5 మి.మీ నుంచి 399.1 మి.మీకి చేరుకుంది. గతేడాది తో పోల్చితే ఈ ఏడాది 742.9 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 562.1 మి.మీ గా ఉంటే దానికి 32 శాతం అధికంగా ఈ ఏడాది వర్షపాతం నమోదైంది.
అయితే ప్రస్తుత వర్షపాతం మాత్రం సాధారణ వర్షాకాలంలో నమోదయ్యే వర్షపాతం స్థాయి జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న మొత్తం సీజన్ లో సాధారణ వర్షపాతం కంటే కూడా ఇది 163 మి.మీ తక్కువ అని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కురుస్తున్న వర్షపాతం వల్ల ఇప్పటి వరకు నగరంలో కానీ, ఇతర జిల్లాలో కానీ లోటుగా ఉన్న వర్షపాతం కాస్త మిగులు వర్షపాతం గా మారిపోయింది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం మీద వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి గంటలకు 5 సెం.మీ నుంచి 6 సెం.మీ వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోవడంతో అక్కడ ఉన్న వారందరిని పునరావస కేంద్రాలకు తరలించారు.
ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ఐటీ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో పని చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని రిజర్వాయర్లు అన్ని కూడా పొంగిపోర్లుతున్నాయి.
వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. శుక్రవారం పలు జిల్లాలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్, శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నవారు ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కూడా పేర్కొన్నారు.
Also Read: మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు - సీఎం కేసీఆర్ చొరవతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం