Telangana Elections 2023: ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు, వారిపై చర్యలు తప్పవు
పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Telangana Elections 2023: పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టితో కలిసి రిటర్నింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. ర్యాంప్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో వాహనాల పారింగ్ స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో నిర్దేశించిన ఓటర్లు దాటిన పక్షంలో ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వేగంగా ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ నాయకుల ద్వారా ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగినట్లు తెలిస్తే వేటు తప్పదన్నారు. ఈ విషయంలో బీఎల్‌ఓలపై కఠినంగా వ్యవహరించాలని ఆర్ఓలను ఆదేశించారు.
ఓటరు జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవడంపై ఓటర్లకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఓటర్లు పోలింగ్ కేంద్రానికి సులువుగా చేరే విధంగా రూట్ మ్యాప్‌ను రూపొందించి గూగుల్ మ్యాప్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో క్లెయిమ్స్ అండ్ అబ్జక్షన్స్ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆబ్సెంట్, షిఫ్టెటెడ్, డెత్ లిస్ట్‌లను బీఎల్‌ఓ సేకరించి రిటర్నింగ్ అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్లకు సమాచారం అందించాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు వంత పాడే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ఏఎస్‌డీ జాబితాలో ఉన్న ఓటరు పోలింగ్ కేంద్రానికి వస్తే సరైన డాక్యుమెంట్లను పరిశీలించి ఓటు హకు కల్పించాలని సూచించారు. ఆ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి ఓటరు ఫోన్ నంబర్లను సేకరించాలని, తద్వారా వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటు వినియోగించుకోవడానికి సంక్షిప్త సమాచారాన్ని అందజేయాలని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రె, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్స్ శంకరయ్య, పలువురు ఆర్వోలు పాల్గొన్నారు.
బ్యాంకు లావాదేవీలపై దృష్టి
ఎన్నికల నేపథ్యంలో బ్యాంకుల్లో అనుమానిత లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్‌డ్రాల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్‌కు రోజు వారీ నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు. బ్యాంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అనుమానిత, లెక్కకు మించిన నగదు ఖాతాలపై నిఘా ఉంచాలని బ్యాంకు మేనేజర్లకు ఆయన సూచించారు.