MIM MLA Akbaruddin Owaisi: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Election 2023 : చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. మంగళవారం రాత్రి సంతోష్ నగర్ సీఐతో వాగ్వాదానికి దిగి వార్నింగ్ ఇచ్చారు అక్బరుద్దీన్.
![MIM MLA Akbaruddin Owaisi: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసిన పోలీసులు Telangana Elections 2023 Case registered against MIM MLA Akbaruddin Owaisi in santhosh Nagar ps MIM MLA Akbaruddin Owaisi: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/530d4aba1f6fa3993ab55755397fb8731700648142527233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akbaruddin Owaisi Election Campaign: హైదరాబాద్: చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం (AIMIM) నేత అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi)పై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ పై సంతోష్ నగర్‌లోని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. ప్రచార సమయం ముగిసిందని, ప్రచారం ఆపాలని సంతోష్ నగర్ సీఐ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు మంగళవారం రాత్రి 10 గంటలు దాటిన తరువాత సూచించారు. నిర్ణీణ సమయం ముగిసిన తరువాత లలితాబాగ్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహిస్తుండటంతో ప్రచారం నిలిపివేయాలని పోలీసులు సూచించారు. కానీ సంతోష్ నగర్ సీఐ శివ చంద్రపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మిమ్మల్ని పరుగులు పెట్టించాలా, నాలో ఇంకా సత్తా ఉందంటూ వేలెత్తి చూపిస్తూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, వారిని హెచ్చరించడం లాంటి పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ పై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ లలితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్రచారం చేశారు. అయితే రాత్రి 10 గంటలు దాటిపోయిందని ప్రచారం ఆపాలని సంతోష్ నగర్ సీఐ అక్బరుద్దీన్ కు సూచించారు. పోలీసులు చెప్పిన మాటతో అక్బరుద్దీన్ ఆవేశానికి లోనయ్యారు. నన్నే ఆపుతావా, కత్తులు దిగాయి, బుల్లెట్లు దిగాయని నాలో సత్తా తగ్గింది అనుకుంటున్నావా అంటూ పోలీసులపై మండిపడ్డారు. కనుసైగ చేస్తే చాలు పోలీసులను ఇక్కడి నుంచి పరిగెత్తిస్తామంటూ సంతోష్ నగర్ సీఐకి అక్బరుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు.
సమయం మించిపోయిందని పోలీసులు వారిస్తున్నా.. తన దగ్గర సైతం వాచీ ఉందని, ఇంకా 5 నిమిషాలు ప్రచారం చేసుకునే టైం ఉందని అక్బరుద్దీన్ అన్నారు. తనను ఆపడం ఎవరివల్ల కాదని, ఈ 5 నిమిషాలు కచ్చితంగా ప్రచారం చేస్తానంటూ సీఐతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఉన్న ఆవేశం, సత్తా ఇంకా తనలో ఉందని, మిమ్మల్ని పరుగులు పెట్టించమంటావా అంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మంగళవారం రాత్రి పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ వారి విధులకు ఆటంకం కలిగించడం, వారిని హెచ్చరించడం లాంటివి చేయడంతో పలు సెక్షన్ల కింద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)