Padmarao Goud: కేసీఆర్ ఆదేశిస్తే జపాన్‌లో కూడా పోటీచేస్తా, పార్టీ మార్పుపై పద్మారావు గౌడ్ క్లారిటీ
తాను టీఆర్ఎస్ పార్టీలో పూర్తి ఆత్మ సంతృప్తితో ఉన్నానని, మళ్లీ సికింద్రాబాద్ నుంచే పోటీ చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్పష్టత ఇచ్చారు.
పార్టీ మార్పు పుకార్లపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తి ఆత్మ సంతృప్తితో ఉన్నానని, మళ్లీ సికింద్రాబాద్ నుంచే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. ఒకవేళ హైకమాండ్ ఆదేశిస్తే జపాన్‌లో కూడా పోటీ చేయడానికి తాను సిద్ధమని పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తారు మరచిపోతారు అని అనుకుంటారు అంతా. కానీ నేను ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉంటాను. అందులో భాగమే సీతాఫల్ మండీలో జూనియర్ డిగ్రీ కళాశాలను సాధించాను. అసాధ్యం అనుకున్న దానిని పోరాడి సాదించుకున్నాము. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. సికింద్రాబాద్ లో మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. రూ.102 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులన్ని చేపట్టాము. ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తి చేసేవిదంగా ప్రణాళిక చేసాము.
పార్టీ మారబోను - పద్మారావు గౌడ్
‘‘పార్టీ మారతానని పుకార్లు షికార్లు ఎవరు నమ్మవద్దు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన వద్దనేది నియమం ఉంది. నేను 200 శాతం సంతృప్తిగా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. ఈ సారి ఎన్నికలలో కూడా నేనే పోటీ చేస్తాను. కేసీఆర్ కుటుంబ సభ్యులందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా నేను టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెబుతా కదా’’ అని అన్నారు.
బూర నర్సయ్య గౌడ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు ఆత్మగౌరవ సమస్య రాలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎందుకు పార్టీ మారలేదని ప్రశ్నించారు. ‘‘కిషన్ రెడ్డికి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా పక్కపక్కనే కూర్చునే వారిమి. అందుకే ఆయన్ను అప్పుడప్పుడు కలుస్తా’’ అని పద్మారావు గౌడ్ అన్నారు.
గవర్నర్ ఆమోదించాల్సిందే
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి కూడా పద్మారావు గౌడ్ మాట్లాడారు. కొన్ని ఫైల్స్ తొందరగా రావని, నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయని అన్నారు. తాము తెలంగాణలో ఉన్నామని, గవర్నర్ పాకిస్తాన్‌లో లేరు కదా? అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిందేనని అన్నారు. తన రాజకీయ వారసుడు రామేశ్వర్ అని అంతా అంటున్నారని, కానీ అది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.
వీడియో వైరల్
గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరతారని వస్తున్న వార్తలను పద్మారావు గౌడ్ నిన్న (అక్టోబరు 18) ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి వివరణ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీని వీడే ఆలోచనలేదని, కొంత మంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌కు కూడా వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పద్మారావు గౌడ్ మాట్లాడుతున్న వీడియో ఒకటి గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పద్మారావు గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. మునుగోడు ఉప ఎన్నిక, బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్తుండడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, గతంలో ఓ సందర్భంలో కిషన్ రెడ్డితో కలిసి ఉన్న వీడియోను ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని పద్మారావు వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.