Hyderabad News: హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - నగరానికి ప్రభుత్వం కొత్త నిర్వచనం
Telangana News | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా వ్యవస్థపై, మూసీ సందరీకరణపై దుష్ప్రచారం జరుగుతోందని.. హైదరాబాద్ నగర వాసులకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు విషయాలు తెలిపారు.
Hyderabad News Updates | హైదరాబాద్: హైడ్రాపై, మూసీ సందరీకరణపై గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ప్రజలు, రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని అనేది తమ కాంగ్రెస్ ప్రభుత్వ అజెండా అని, తమకు వ్యక్తిగత, పార్టీ అజెండా లాంటివి లేవన్నారు. సెక్రటేరియట్ లో భట్టి విక్రమార్క హైడ్రా, మూసీ ప్రాజెక్టుపై మాట్లాడారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అన్నారు. అద్భుతమైన గుట్టులు, రుపాలతో రాక్ గార్డెన్ లా కనిపించేదన్నారు. దీనిపై పరోశోధనకారులు రీసెర్చ్ చేశారని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు, సరస్సులు ఎందరినో ఆకట్టుకున్నాయి. కానీ కాలక్రమేణా రాక్స్ కనిపించకుండా పోయాయి. పార్కులు సైతం కబ్జాలకు గురవుతున్నాయి.
చెరువులు, జలాశయాలు హైదరాబాద్ ప్రజల ఆస్తి
‘నగర వాసులకు మంచినీటి వనరుల కోసం దశాబ్దాల కిందట అందుకు అనువైన విధంగా చెరువులు, జలాశయాలు నిర్మించారు. కానీ క్రమక్రమంగా ఆ లేక్స్ కనుమరుగు కావడం వల్ల భారీ వర్షాల సమయంలో వచ్చే వరదలతో హైదరాబాద్ ప్రజలకు ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ (Hyderabad ORR) లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనుకున్నాం. గత ప్రభుత్వాలు ఏదో ఓ కారణంతో మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పినా చేయలేకపోయాయి. భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా, అద్భుతంగా అందించాలన్న సంకల్పంతో చెరువులు, జలాశయాల సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని తీర్చిదిద్దాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా. ఇక్కడ ఎవరి అజెండాలు, పార్టీ అజెండాలు లేవు, కేవలం రాష్ట్ర అభివృద్ధి అజెండా తప్ప. కబ్జాలకు గురైన చెరువులు హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని’ భట్టి విక్రమార్క చెప్పారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెరువుల వివరాలు వెల్లడి
హైదరాబాద్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రీమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ శాటిలైట్ ద్వారా హైదరాబాద్ లో చెరువులు ఎలా కబ్జాలకు గురయ్యాయి. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ లోని చెరువులు, జలాశయాలు ఎన్ని ఉన్నాయి. వాటి భూములు ఎంతమేర తగ్గిపోయాయో ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ సుందరీకరణ ఆవశ్యకతను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. మూసీ ప్రాజెక్టుకు 1.5 లక్షల కోట్లు ఖర్చు అని దుష్ప్రచారం చేస్తున్నారు. కొందరేమో ఈ ప్రాజెక్టు కోసం ఏ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అడుగుతున్నారు. చర్యలు మొదలుపెట్టగానే ప్రజలలో భయాలు రేకెత్తిస్తున్నారని, ఇది మంచి పద్దది కాదని హితవు పలికారు.
ప్రపంచ దేశాల తరహాలో ఇక్కడ చేయకూడదా?
లండన్ లో థేమ్స్ నది, జపాన్ లోని ఒసాకాలో నది నగరం మధ్యలో ఉంటే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది. జపాన్ లోని సుమిద రివర్ ఎలా ఉందో స్వయంగా తాను పరిశీలించినట్లు భట్టి తెలిపారు. హైదరాబాద్ ఒడ్డున ఉన్న మూసీ నది పరిస్థితి ఎలా ఉందో వీడియోను ప్రదర్శించారు. ఇక్కడ మన వద్ద కూడా చెరువులు, జలాశయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ పనులు ప్రభుత్వం చేయాలి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టి కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.