Hyderabad News: హైదరాబాద్ తాగునీటికి, మూసీ ప్రాజెక్టుకు 20 టీఎంసీలు- రూ.7,360 కోట్లతో ప్రభుత్వం ప్రాజెక్టులు
హైదరాబాద్ తాగునీటికి, మూసీ పునరుజ్జీవానికి 20 టీఎంసీలు నీళ్లు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రూ.7,360 కోట్ల వ్యయం కానుంది. ఆ ప్రాజెక్టులకు CM Revanth Reddy శంకుస్థాపన చేయనున్నారు.

Godavari Water To Hyderabad City | హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చడం సహా మూసీ పునరుజ్జీవనానికి సంబంధించిన రూ.7360 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గండిపేట వద్ద నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గోదావరి నీటి తరలింపు పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాల పనులు ప్రారంభించనున్నారు. నియో పోలీస్ వాటర్ సప్లై & సేవరేజ్ ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం గండిపేట గోల్కొండ రిసార్ట్స్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తరలింపు
తాగునీటి అవసరాల కోసం గోదావరి డ్రింకింగ్ వాటర్ పథకం (ఫేజ్-1) ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ క్రమంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ జలాశయం నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ నగరానికి తరలించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 టీఎంసీలలో 2.5 టీఎంసీల నీటిని హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీ నది పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. మిగిలిన 17.5 టీఎంసీల నీటిని నగరంలో తాగునీటి సరఫరా కోసం వినియోగించనున్నారు. అలాగే ఈ మార్గంలో ఉన్న 7 చెరువులను కూడా నీటితో నింపనున్నారు.
ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపడతారు. ప్రాజెక్టులు పూర్తి చేసి 2030 నాటికి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే అధికారులు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి తాగునీటి అవసరాలను తీర్చడం ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా మారింది. ఈ క్రమంలో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ (ఫేజ్-II & III) కింద రూ.7,360 కోట్ల విలువైన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
నిర్మాణ సంస్థ 60 శాతం ఖర్చు
ప్రాజెక్టు ఖర్చు నిధుల్లో 60 శాతం (రూ.4416 కోట్లు) నిర్మాణ సంస్థలు వెచ్చించనున్నాయి. మిగిలిన 40 శాతం (రూ.2,944 కోట్లు) జలమండలి భరిస్తుంది. ఈ మొత్తాన్ని జలమండలి హడ్కో లోన్ తీసుకుంటోంది. నిర్మాణంతో పాటు 10 నిర్మాణ సంస్థే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌కు రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల(ఎంజీడీ) తాగునీరు సరఫరా అవుతుండగా.. తాజాగా చేపడుతున్న గోదావరి ఫేజ్- 2, 3లతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.






















