CM Revanth Reddy:17 ఏళ్ల ప్రయాణంలోనే సీఎం అయ్యాను, అలా చేయడానికి మూర్ఖుడ్ని కాదు: రేవంత్ రెడ్డి
Telangana News | అసలు సిసలైన ఉద్యమకారులు ఎవరూ నేనే ఉద్యమకారుడిని అని చెప్పుకోరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 17 ఏళ్ల ప్రయాణంలోనే సీఎం అయ్యానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy participate in Release of Book Hasitha Bhashpalu | తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రజల ఆత్మగౌరవం, కవిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన ఉద్యమకారులు తెలంగాణ కవులు, రచయితలు అని, వారెన్నడూ తాము ఉద్యమకారులం అని చెప్పుకోలేదన్నారు. “హసిత భాష్పాలు” పుస్తక ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రచయిత శ్రీరామ్ రచనను ప్రశంసిస్తూ, పలుమార్లు ఉద్యమస్ఫూర్తిని, ప్రజల సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు.
శ్రీరామ్ – పాలమూరుకు గర్వకారణం:
రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడమే గర్వకారణంగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, "తెలంగాణ సమాజం ఎంతో మందిని కవులుగా ప్రేరేపించిన గడ్డ. అలాంటి భూమిలో పెరిగిన శ్రీరామ్ రచన అందరికీ స్ఫూర్తి ఇవ్వాలని" ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజమైన ఉద్యమకారుల గురించి:
“నిజమైన ఉద్యమకారులు ఎవరూ నేనే ఉద్యమకారుడిని అని చెప్పుకోరు,” అన్నారు సీఎం. “అందెశ్రీ ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. కానీ ఆయన చేసిన కృషి, ఆయన రాసిన పాటలు తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశాయి. అదే సమయంలో, "ఉద్యమకారుడిని అని చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పత్రికలు, కోట్లాది ఆస్తులు వచ్చాయి, కానీ మేము ఆ పంథాలో లేము," అని రాజకీయాల పట్ల ఓ ఆత్మవిమర్శ వ్యక్తం చేశారు.
స్ఫూర్తిదాయక కవులు – ఉద్యమ హిరోలు:
గూడ అంజయ్య, అందే శ్రీ, గద్దర్, గోరేటి వెంకన్న వంటి కవులు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్పూర్తి నింపారని సీఎం కొనియాడారు. గద్దర్, అందే శ్రీ తెలంగాణ ప్రజల స్వేచ్ఛను కోరుకున్నారు. వారి భావజాలమే ప్రజల్లో అసలైన మార్పును తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకుడిగా తన పాత్ర:
“నేను ఎవరిని శత్రువుగా చూడను. శత్రువుగా చూడాలంటే వారి స్థాయి ఉండాలి,” అని స్వయంగా చెప్పుకొచ్చారు సీఎం. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ – “2006 లో ప్రారంభమైన నా ప్రయాణం 17 సంవత్సరాల్లో సీఎం స్థాయికి చేరింది. ఇది ప్రజల అచ్చమైన విశ్వాసానికి నిదర్శనం.
అభివృద్ధి అంటే ఏమిటి?
భవనాలు కట్టడం అభివృద్ధి కాదు, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పేదలు ఆత్మగౌరవంగా బతకడమే నిజమైన అభివృద్ధి అన్నారు సీఎం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా 4 లక్షల కుటుంబాలు తమ తల ఎత్తుకుని జీవితం గడుపుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాల ద్వారా పేదల గౌరవం నిలబెట్టామని తెలిపారు.
అభిమానం, రాజకీయ వైఖరి:
“నాకు నచ్చని వారిపైనా అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పదవిని వాడను. ప్రజల కోసం పనిచేస్తాను, నా గెలుపే నా ప్రత్యర్థులకు దుఃఖం. నేను సీఎంగా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపై గీత పెట్టినట్లైంది,” అని తన విజయం పట్ల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ భవిష్యత్తు:
"2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యం, ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను గుర్తింపు పొందేలా మారుస్తాను" అని ప్రజలకు భరోసా ఇచ్చారు.
సాంస్కృతిక గర్వం:
109 దేశాల నుంచి వచ్చిన మహిళలతో “జయ జయహే తెలంగాణ” పాట పాడించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ – "ఇంకా ఇంతకంటే గొప్ప గర్వం ఏముంటుంది? తెలంగాణ తల్లి ముందు వారిని మోకారిల్లేలా చేశాం," అన్నారు.
ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ వ్యాఖ్యల్లా కాకుండా, ఉద్యమం, ఉద్యమకారుల పట్ల గౌరవాన్ని, పేదల పట్ల బాధ్యతను, భవిష్యత్ తెలంగాణ పట్ల తన దృష్టిని చక్కగా ప్రతిబింబించింది. “హసిత భాష్పాలు” పుస్తక ఆవిష్కరణ ఈ సందర్భంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.





















