Telangana Cabinet: కేబినెట్ సమావేశం తర్వాత కేసీఆర్ కీలక ప్రకటన! బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు భారీ స్కెచ్!
వరి పోరులో బీజేపీని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇవాల్టి మంత్రి మండలిలో కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR )కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు రకాల ఆందోళనల ద్వారా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. సోమవారం పార్టీ యంత్రాంగం మొత్తం దిల్లీలో నిరాహారదీక్ష చేసింది. దీక్ష వద్ద సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణలో పండించిన వడ్లు కొంటారా కొనరా అంటు ప్రశ్నించారు.
కేంద్రం ఎప్పటిలాగానే తాము కొనేది లేదని తేల్చి చెప్పేసింది. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న సస్పెన్స్ సర్వత్రా నెలకొంది. కాసేపట్లో జరిగే మంత్రిమండలి భేటీ తర్వాత కేసీఆర్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ సంచలన ప్రకటన ఏమిటన్నదానిపై ఇప్పుడు టీఆర్ఎస్‌లో ( TRS )విస్తృతంగా చర్చ జరుగుతోంది.
రైతులు నష్టపోకూడదన్నదే టీఆర్ఎస్ ధ్యేయం కాబట్టి రైతులు ఎన్ని వడ్లు పండించినప్పటికీ చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వాస్తవానికి యాసంగిలో ( Yasangi ) వరి పంట వేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక్క వడ్ల గింజ కొనే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ నేరుగానే తేల్చి చెప్పారు. అయినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున పంట వేశారు. ఈ నెలలోనే కోతలు ప్రారంభమవుతాయి.
కేంద్రం (Center Governament ) బాయిల్డ్ రైస్ తీసుకోనంటోందని.. అలాగే వడ్లనూ కొనుగోలు చేయనంటోందని ఈ కారణంగానే ధాన్యం పండించవద్దని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రైతులు వరి వేయాలని.. ఎందుకు కొనరో తాము చూస్తామని ప్రకటించారు. ఈ రాజకీయ నాయకుల భరోసా వల్ల కానీ.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన లేకపోవడం కానీ రైతులు యాసంగిలో ఎప్పుడూ పండించేంత వరి పంటను పండిస్తున్నారు. వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో ఇప్పుడు తెలంగాణ సర్కారే నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
రైతులను నట్టేట ముంచేందుకు బీజేపీ ( BJP ) ప్రయత్నించిందని.. తాము ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగిలిన ధాన్యాన్ని స్థానికంగానే పంపిణీ చేసే ప్రణాళిక అమలు చేయడమో.. లేకపోతే ఎగుమతి చేయడమో చేసే అవకాశం ఉంది. మొత్తంగా ధాన్యంపై పోరులో బీజేపీని దోషిగా నిలిపి.. రైతుల్ని తాము ఆదుకుంటున్నామని కేసీఆర్ సాయంత్రానికి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.