Modi Hyderabad Visit: ప్రధానికి ఘన స్వాగతం పలకనున్న కేసీఆర్, పర్యటన ముగిసేదాకా ఆయన వెంటే.. పూర్తి షెడ్యూల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారని అంతా భావించారు. ప్రస్తుతం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర విమర్శల వల్ల మోదీని కలవరనే అభిప్రాయం వ్యక్తమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాల్లో ఆ తర్వాత ముచ్చింతల్‌లో రామానుజాచార్య విగ్రహావిష్కరణలో ప్రధాని పాల్గొంటారు. అయితే, ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వెంటనే ఉండనున్నారు. తొలుత శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ రాగా.. అక్కడ సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయనతోపాటే హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అక్కడి నుంచి ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే వరకూ సీఎం మోదీతోనే ఉండనున్నారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కార్యాలయం శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల విడుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారని అంతా భావించారు. ప్రస్తుతం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర విమర్శల వల్ల మోదీని కలవరనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, కేసీఆర్ ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ఆ తర్వాత సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని పర్యటనలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన కోసం 8 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధించారు పోలీసులు. రామచంద్రపురం ఇక్రిశాట్, ముచ్చింతల్ చిన జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంది. నేడు ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ వరకు డ్రోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పారా గ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పైనా నిషేధం ఉంది.
ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ముచ్చింతల్ లో ఆశ్రమాన్ని శుక్రవారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పర్యటన షెడ్యూల్ ఇదీ..
మధ్యాహ్నం గం. 2.10లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు
ప్రత్యేక హెలికాప్టర్‌లో 2.45లకు ఇక్రిశాట్
2.45 నుండి 4.15 వరకు ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ ప్రారంభకార్యక్రమం
5 గంటలకు ముచ్చింతల్
అక్కడి గెస్ట్ హౌస్‌లో 10 నిమిషాలు రీప్రెష్ అయి ప్రత్యేక వస్త్రధారణలో యాగశాలకు..
5 గంటల నుంచి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమం
సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం
8.20 కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం