Hyderabad News: అతనికి ఆధార్ కార్డ్ దొరికిందా మీ అకౌంట్ ఖాళీ- బిహార్‌లో చిక్కిన కేటుగాడు
Hderabad Crime News: ఆధార్ కార్డు ద్వారా బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ దోచేస్తున్న ఓ వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad Crime News: ఆధార్ కార్డు అతనికి చిక్కిందంటే చాలు.. మీ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ దోచేస్తాడు. ఇలాంటి ఆధార్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట చేశారు. అయితే నిందితుడు బైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి స్టేట్ బ్యాంకు ఖాతాని ఏమార్చి పెద్ద మొత్తంలో నగదు కొట్టేయగా.. అతడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగి నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు.
అసలేం జరిగిందంటే..?
ఖాతాదారుల సౌలభ్యం కోసం చాలా బ్యాంకులు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్) పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలు పొందాలి అనుకునేవారు ముందుగానే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు నెంబర్, వేలి ముద్రలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు లావాదేవీలు నిర్వహించాలనుకుంటే ఒక్కసారి వేలి ముద్రలను ఇస్తే చాలు.. ఆన్ లైన్ ద్వారా నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, నగదు బదిలీ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఖాతాదారులకు మరితం సులభతరమైన సేవలు అందించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఫెసిలిటీని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అక్మల్. రిజిస్ట్రేషన్ల శాఖలోని ధృవపత్రాలు, వాటి నుంచి వేలి ముద్రలు సేకరించాడు. వాటి ఆధారంగా సిలికాన్ పదార్థం ఉపయోగించి నకిలీ వేలి ముద్రలు తయారు చేశాడు.
ఏఈపీఎస్ సేవలు పొందుతున్న ఖాతాదారుల వివరాలు కూడా సేకరించాడు. ఇప్పుడు చాలా బ్యాంకుల ఏటీఎంలు కేవలం వేలిముద్ర ద్వారానే నగదు ఉపసంహరణ సదుపాయాలు కల్పించాయి. పిన్ నంబర్ ఇవ్వాల్సిన పని లేదు. అక్మల్ చోరీ చేసిన వేలి ముద్రలను ఉపయోగించుకొని ఇటువంటి ఏటీఎంల ద్వారా పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరించుకున్నాడు. సీఐడీలోని సైబర్ క్రైమ్స్ విభాగం అధికారులు ఈనెల 22వ తేదీన బిహార్ లోనే అక్మల్ ను అరెస్ట్ చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై మంగళవారం హైదరాబాద్ తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు.
సైబర్ నేరాలపై ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి..
- మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.
- లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
- అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
- వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
- తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
- మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.
- "ఇంస్టాగ్రామ్"లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండని సూచిస్తున్నారు.
- తాము మోసపోయామని ఏ మాత్రం అనుమానం ఉన్నా.. వెంటనే NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కూడా కాల్ చేయవచ్చు.