HYDRA News: ఓఆర్ఆర్ పరిధిలో అవన్నీ హైడ్రా పరిధిలోకి - హైకోర్టు వ్యాఖ్యలతో సీఎస్ కీలక సమావేశం
Hyderabad News: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలతో సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.
HYDRA Latest News: హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) కూల్చివేతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక సమావేశం నిర్వహించారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే కూల్చివేతల విషయంలో ముందుకు వెళ్లాలని హైడ్రాకు ఇటీవల హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఏంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో సీఎస్ శాంతి కుమారి భేటీ అయ్యారు. లీగల్‌గా ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఈ హైడ్రా సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు సీఎస్ విధివిధానాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగిస్తామని సీఎస్ తెలిపారు. ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), నాలా ఎంక్రోచ్‌మెంట్ (నాలాల ఆక్రమణ), ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణలను కూడా హైడ్రా పరిధిలోకి తెస్తామని సీఎస్ తెలిపారు. వీటితో పాటుగా గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తున్నామని వెల్లడించారు.
అదనపు సిబ్బంది నియామకం
హైడ్రా విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు గానూ వారికి కావాల్సిన అదనపు అధికారులను, ఇతర సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతామని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటు అయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ ను కొనసాగిస్తామని తెలిపారు. పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరగా కేటాయిస్తామని సీఎస్ తెలిపారు.