Telangana Rains: రాజకీయాలు వద్దు వరద సహాయక చర్యలపై దృష్టి పెట్టండి- కేసీఆర్‌కు బీజేపీ లీడర్ల సూచన
వాతావరణ శాఖ ముందస్తు సూచనలు చేసినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా... సహాయక చర్యలను ముమ్మరం చేయడం లేదని ఆరోపించింది బీజేపీ. ఇప్పటికైనా మేల్కొని ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించాలని హితవు పలికింది.
వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతున్నా సహాయక చర్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. రాజకీయాలు పక్కన పెట్టి సీఎం వరద బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రిక్వస్ట్ చేశారు బండి సంజయ్. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు బండి సంజయ్. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్సవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమైపోయాయన్నారు. అనేక ప్రాంతాల్లో నీటిలోనే ప్రజలు జీవినసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తమకు సమాచారం వస్తుందన్నారు బండి సంజయ్.
మరికొన్ని రోజులు వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్దం చేయడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఇది ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వరదతో కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితి భయానకంగా ఉన్నా ప్రభుత్వం అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని, రాజకీయాలను పక్కన పెట్టి వరద సాయంపై దృష్టి పెట్టాలని సూచించారు బండి సంజయ్. తక్షణమే కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదను అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ, పంట, ఆస్తి నష్టం వాటిల్లికుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో ప్రజలకు ఆహార, తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేనందున నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల కారణంగా శిథిలావస్థలోనున్న అనేక భవనాలు నాని కూలిపోయే ప్రమాదం ఏర్పడినందున వెంటనే వాటిని గుర్తించి అందులో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు బండి సంజయ్. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశాలున్నాయన్నారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను తరలించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహాయ చర్యల్లో నిమగ్నమయ్యేలా చెయ్యాలని అభిప్రాయపడ్డారు. వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి సహాయ చర్యలను పర్యవేక్షించాలన్నారు.