Bandi Sanjay On TRS: కాంగ్రెస్ తెచ్చిన చట్టంతో బీజేపీ గేమ్- తెలంగాణ పొలిటికల్ ఫైట్‌లో మరో ఎత్తుగడ
తెలంగాణలో మరో పొలిటికల్ ఎపిసోడ్‌కు తెరలేచింది. మాటకు మాట అంటూ సాగిన పాలిటిక్స్ ఇప్పుడు మరో దశకు చేరాయి. కాంగ్రెస్ హాయంలో తీసుకొచ్చిన ఓ చట్టాన్ని యూజ్ చేసుకొని టీఆర్‌ఎస్‌పై పోరుకు సిద్ధమైంది బీజేపీ.
జాతీయ కార్యవర్గం సమావేశాలు ఉత్సాహం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దూకుడు పెంచాలన్న అధిష్ఠానం ఆదేశాలతో తెలంగాణలో బీజేపీ లీడర్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ముందడుగు వేశారు.
బిజెపి తెలంగాణశాఖ టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు పెంచింది బీజేపీ. 8 ఏళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు వెలికి తీసేందుకు సిద్ధమైంది. దీనికి సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ, శాసనమండలి, వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రజలను ముందు ఉంచబోతుంది. దీంతోపాటు 2014, 2018 టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కూడా ఫోకస్ చేసింది.
ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ, రెవెన్యూ, ఎసిబి, సంక్షేమ, పంచాయతీరాజ్, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు ఆర్టీఐ ద్వారా దాదాపు వందకుపైగా దరఖాస్తులు చేశారు బండి సంజయ్. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, టిఆర్‌ఎస్ పార్టీని ఆధారాలతో సహా, పకడ్భందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే తమ ఉద్దేశమని ప్రకటించారు బండి సంజయ్.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా దరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా దాఖలు చేయాలని, పార్టీకి అనుబంధంగా ఉన్న యువమోర్చాలు, పార్టీ రాష్ట్రనాయకులు వివిధ అంశాలపై ఒత్తిడి పెంచాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనల వివరాల కోసం దరఖాస్తు చేశారు.
ఇప్పుడు అదే బాటలో బండి సంజయ్ వెళ్తున్నారు. గత నెల 28న ఆర్‌టిఐ ద్వారా సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వశాఖల్లో దరఖాస్తు చేశారు.
దరఖాస్తుల వివరాలు
1. 2 జూన్ 2014 నుంచి 2 జూన్ 2022 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా, వివిధ సమావేశాల్లో, సభల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు
2. 2 జూన్ 2014 నుంచి 2 జూన్ 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?
3. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ, శాసనమండలిలో ఇచ్చిన హామీలు (assurances) వివరాలు
4. శాసనసభ, శాసనమండలిలో సీఎం ఇచ్చిన హామీల్లో (assurances) ఎన్ని అమలు అయ్యాయి? ఎన్ని పెండిరగ్‌లో ఉన్నాయి?
5. 2 జూన్ 2014 నుంచి 2 జూన్ 2022 ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు ఇప్పటివరకు రాష్ట్రసచివాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించారు?
6. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 జూన్ 2014 నుంచి 2 జూన్ 2022 వరకు ఎన్నిరోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో బస చేశారు? ఫామ్‌హౌస్‌లో ఎన్ని రోజులు ఉన్నారు?
7. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది?
8. ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్ నిర్మాణం పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తిచేశారు?
9. 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసింది? ఈ నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీల భర్తీ కోసం విడుదల చేశారు?
10. 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు ఎన్ని ఉద్యోగఖాళీలు భర్తీచేసింది? ఎంత మందికి కొత్త వారు ఉద్యోగాల్లో చేరారు?
11. 2 జూన్ 2014 నుంచి 30 మే 2022 వరకు ఎంత మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు?
12. బిస్వాల్ కమిటి రిపోర్ట్ ప్రకారం వివిధ ప్రభుత్వశాఖల్లో ఎన్ని ఉద్యోగఖాళీలు ఉన్నాయి?
13. బిస్వాల్ కమిటి రిపోర్టుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి?
14. 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేసింది?
15. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయపోస్టులు ఖాళీగా ఉన్నాయి?
16. 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు? ఆ పర్యటనలకు ఎంత ఖర్చు అయింది?
17. 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పర్యటనలకు ప్రైవేట్ విమానాలను వినియోగించారా? లేక రెగ్యులర్ విమానాల్లోనే ప్రయాణించారా?
18. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 జూన్ 2014 నుంచి 25 జూన్ 2022 వరకు వివిధ రాష్ట్రాలో పర్యటించినప్పుడు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉన్నారా? లేక ప్రైవేట్ హోటళ్లల్లో బస చేశారా?
19. 2 జూన్ 2014 నుంచి 30 మే 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు తీసుకున్న జీతభత్యాలు ఎంత?
20. 2 జూన్ 2014లో తెలంగాణలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత సాగునీరు అందింది.