Telangana: పెండింగ్ సమస్యల పరిష్కారం కాలేదని ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తి - ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తున్న సంఘాలు
Revanth Reddy: పెండింగ్ సమస్యల పరిష్కారం కాలేదని తెలంగాణ ప్రభుత్వంపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తున్నాయి.
Telangana Employees: తెలంగాణలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు పది నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తున్నాయి. నాంపల్లిలో ఉన్న తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు సోమవారం సమావేశమయ్యాయి. డిమాండ్లు సాధించుకునేందుకు జేఏసీ ఏర్పాటుకు తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ సంఘాల నేతలు అంగాకరించారు. దీనికి చైర్మన్‌గా టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఉంటారు. ప్రాతినిధ్యం వహించనున్నాయి. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే పీఆర్టీయూటీజీ సైతం వీళ్లతో కలవడం ఆసక్తిరేపుతోంది.
మొత్తం 15 మందితో ఈ జేఏసీ ఏర్పాటు అయింది. అయితే రాష్ట్రంలో ఉన్న ఇతర సంఘాల నేతలను సంప్రదించి పూర్తి స్థాయి కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తర్వాత డిమాండ్ల సాధనపై ప్రభుత్వంతో సంప్రదింపులు చేయనున్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు దాటింది. 4 డీఏ బకాయిలు, పీఆర్సీ , హెల్త్ కార్డుల జారీ, సీపీఎస్ రద్దు, జీవో 317 సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టి పెట్టుకొని కొంత సమయం కావాలని సీఎం అభ్యర్థన మేరకు ఇన్ని రోజులు ఆగామని ఇకపై ఆగే పరిస్థితి లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని అంటున్నారు.
ప్రస్తుతానికి విదేశీ పర్యటనలో సీఎం ఉన్నారని ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ వెళ్లి రేవంత్‌రెడ్డిని కలుస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారంపై ఆయన నుంచి వచ్చిన స్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందన్నారు జేఏసీ నేతలు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది కేవసం 30 మాత్రమే అన్నారు. మిగతా వాటిని దశల వారీగా పరిష్కించుకోవడానికి తాము సిద్ధమని తెలిపారు. ఆర్థిక సమస్యలు లేని వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు అందుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వం దృష్టికి ఉద్యోగ సంఘాలు తీసుకెళ్తున్న సమస్యల చిట్టా ఇదే
- నాలుగు డీఏ బకాయిలు విడుదల
- సీపీఎస్ రద్దు
- కొత్త పీఆర్సీ అమలు
- జీవో 317 సమస్యల పరిష్కారం
- పెండింగ్ బిల్లులు చెల్లింపు
- టీచర్స్‌కి ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్