Chandrababu Discharged: వైద్య పరీక్షల అనంతరం ఏఐజీ నుంచి చంద్రబాబు డిశ్చార్జి, నెక్ట్స్ ఎల్వీ ప్రసాద్ కు!
Chandrababu Health Condition: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లనున్నారు.
Chandrababu discharged from aig hospital:
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG Hospital) ఆస్పత్రి వైద్యులు చంద్రబాబును డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే సమయంలో చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి ఉన్నారు. ఏఐజీ నుంచి డిశ్ఛార్జ్ అయిన చంద్రబాబు అనంతరం జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారని తెలిసిందే.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించింది. ఆయన తెలిపిన సమస్యలు విన్న డాక్టర్లు గురువారం ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించారు. డాక్టర్ల సూచన మేరకు చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల టీమ్ చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసింది.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై షరతులు - హైకోర్టు కీలక తీర్పు
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లో మరికొన్ని అదనపు షరతుల విధించాలన్న సీఐడీ అనుబంధ పిటిషన్ పై శుక్రవారం ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనొద్దని, కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని, గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను ఏర్పాటు చేయాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీపై కేసు నమోదు
బుధవారం హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు ర్యాలీపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ర్యాలీ ద్వారా 2 గంటల పాటు రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేశారని పోలీసులు తెలిపారు. 2 గంటలు రోడ్లపై అలా వెళ్లడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వెల్లడించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు.