(Source: ECI/ABP News/ABP Majha)
Kcr Stalin: కేసీఆర్ కు స్టాలిన్ ఆహ్వానం, అందుకోసమేనా?
Kcr Stalin: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ తమ రాష్ట్రానికి ఆహ్వానించారు. చెస్ ఒలింపియాడ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు.
Kcr Stalin: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తమ రాష్ట్రానికి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు స్టాలిన్ కేసీఆర్ ను తమిళనాడుకు ఆహ్వానించాడన్న ఆత్రుత రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే ఎందుకోసం కేసీఆర్ ను ఆహ్వానించారో తమిళనాడు ప్రభుత్వం చెప్పేసింది.
కేసీఆర్ ను ఎందుకు పిలిచారు?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో చెస్ ఒలింపియాడ్ నిర్వహించనుంది. జులై 28 నుండి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల అంటే ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ఒలింపియాడ్ జరగనుంది. ఇది 44వ ఫైడ్(FIDE) అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్. ఈ పోటీలను విజయవంతం చేయాలని తమిళనాడు రాష్ట్ర సర్కారు ఆశిస్తోంది. అందుకు మంచి గుర్తింపు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పోటీలకు మంచి హైప్ తీసుకురావాలనకున్న తమిళనాడు ప్రభుత్వం అందులో భాగంగా పలువురికి ఆహ్వానాలు పంపుతోంది. ఈ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు.
ఈ మేరకు సీఎం స్టాలిన్ తన పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరి రాజన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్ కు ఆహ్వాన లేఖను పంపించారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి జూలై 28 నాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం కోరారు. ఈ సందర్భంగా డిఎంకె ఎంపీ గిరి రాజన్.. సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి, జ్జాపికను అందచేసి ఆహ్వాన పత్రికను అందించారు.
ఏమిటీ పోటీలు?
చెస్ ఒలింపియాడ్ చాలా ప్రతిష్టాత్మకమైన పోటీలు.ఇప్పటి వరకు భారత దేశంలో ఒక్కసారి కూడా ఈ పోటీలు జరగలేదు. ఫైడ్ అంతర్జాతీయ పోటీలు భారత్ లో జరగడం ఇదే మొట్ట మొదటి సారి కావడం విశేషం. అసలు ఆసియాలోనే ఈ పోటీలు జరగడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. అలాంటి భారత్ లో తొలిసారి. ఈ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు దాదాపు 188 దేశాల నుండి చెస్ క్రీడాకారులు వస్తారు. భారత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక పోటీలు ఇవి. ఈ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటూ పంపిన ఆహ్వాన పత్రికలో ఈ విషయాలను వెల్లడించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
గతేడాది కలిసిన నేతలు..
సీఎం కేసీఆర్ గతేడాది డిసెంబర్ లో తమిళనాడులో పర్యటించారు.పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ స్టాలిన్ ను కలిశారు. తమిళనాడు సీఎం ఇంటికి వెళ్లిన కేసీఆర్ కు స్టాలిన్ సాదర స్వాగతం పలికారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికి శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు ఇద్దరు సీఎంల కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ భారత్ లోని రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు అలా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, కుమాడురు మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ, మనవడు, మనవరాలు, ఎంపీ సంతోష్ రావు ఉన్నారు.