KCR on Krishna Death: తెలుగువారి జేమ్స్ బాండ్, కృష్ణ మరణంపట్ల సీఎంలు, ప్రముఖుల సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు.
నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని గుర్తు చేసుకున్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీఎం జగన్ ట్వీట్
‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.’’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022
నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. (1/2)
సాహసనిర్మాతగా కృష్ణ - చంద్రబాబు
‘‘తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు.(1/2) pic.twitter.com/Yl6oZuJTaT
— N Chandrababu Naidu (@ncbn) November 15, 2022
కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కల్పించే పలు చిత్రాలతో కృష్ణ జనాదరణ పొందారన్నారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సూపర్ స్టార్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రేవంత్ రెడ్డి సంతాపం
పద్మభూషణ్, సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణ హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.