Telangana Weather: తెలంగాణలోకి ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ - ఐఎండీ
రాగల 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ రోజు (జూన్ 22) నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాలకు (ఖమ్మం వరకు) ప్రవేశించాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. నేడు ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలోని ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని అన్నారు.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు అంచనా వేశారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.