Nehru Zoo Hyderabad: జూలో సింహం సహా 7 జంతువుల్ని దత్తత తీసుకున్న బాలుడు, ఎలా తీసుకోవచ్చో తెలుసా?
Hyderabad Latest News: హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో ఏడు జంతువులను ఎంపిక చేసి ఓ బాలుడు దత్తత తీసుకున్నాడు. వాటిలో సింహం, మొసలి, తోడేలు కూడా ఉంది.
Hyderabad Zoo News: జంతు ప్రేమికుడైన యువన్ ఎస్ హిరేమత్ అనే ఏడేళ్ల బాలుడు తన ఉదారతను చాటుకున్నాడు. తన 7వ పుట్టినరోజు సందర్భంగా ఏడు జంతువులను దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ లోని నెహ్రూ జువలాజికల్ పార్కులో ఏడు జంతువులను ఎంపిక చేసి దత్తత తీసుకున్నాడు. వాటిలో ఆఫ్రికన్ సింహం (అదిష్ణ), గ్రేట్ ఇండియన్ వన్ హార్న్డ్ రైనోసిరోస్ (నంద), మొసలి, గుడ్లగూబ, ఉష్ట్రపక్షి, తోడేలు, సింహం తోక గల మకాక్ (Macaque) అనే 7 జాతుల జంతువులను దత్తత తీసుకున్నాడు. ఒక నెల వ్యవధిలో వీటిని దత్తత తీసుకున్నట్లుగా జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. యువన్ ఎస్ హిరేమత్ తన తల్లిదండ్రుల సహకారంతో వీటిని దత్త తీసుకోవడానికి ఆసక్తి చూపాడు.
జూలోని వన్యప్రాణుల సంక్షేమానికి జన్మదిన వేడుక ఒక బెంచ్‌మార్క్‌గా ఉంటుందని యువన్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ దత్తతలో భాగంగా సంబంధిత రూ.75 వేల చెక్కును జూ అధికారులకు అందజేశారు. ఈ చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ (FAC) & క్యూరేటర్ స్వీకరించారు. జంతుప్రదర్శనశాలలోని 7 జాతుల జంతువుల దత్తత, సంక్షేమం కోసం ఈ డబ్బును వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా జూ అధికారులతో యువన్ ఎస్. హిరేమత్ మాట్లాడాడు. తన తల్లిదండ్రులిద్దరూ వన్యప్రాణులు, జంతు ప్రేమికులు కావడంతో తన తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందానని చెప్పాడు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పిల్లలు వన్యప్రాణుల సంరక్షణ పట్ల చొరవ చూపాలని అన్నారు. జంతువుల సంక్షేమం కోసం డబ్బును ఖర్చు చేయమని తల్లిదండ్రులను అభ్యర్థించాలని పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ యాజమాన్యం జంతు దత్తత పథకం ప్రవేశపెట్టిందని.. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు యువన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఎవరైనా సరే తమకు నచ్చిన జంతువును, వారికి నచ్చినన్ని రోజులు దత్తత తీసుకోవచ్చని అన్నాడు. తనకు ఇష్టమైన జంతువులన్నింటినీ దత్తత తీసుకున్నానని.. తన 7వ పుట్టినరోజున తాను 7 జంతువులను దత్తత తీసుకున్నామని అన్నాడు.
దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలి
నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ డైరెక్టర్ (FAC) & క్యూరేటర్ మాట్లాడుతూ.. యువన్ ఎస్. హిరేమత్ తన 7వ పుట్టినరోజు సందర్భంగా 7 జాతుల జంతువులను దత్తత తీసుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. జంతు దత్తత పథకం ఎక్కువ సంఖ్యలో పౌరులను ఆకర్షిస్తుందని.. వారు ఒక చెక్కును అందజేయడం ద్వారా లేదా తమ వెబ్‌సైట్ nzptgfd.telangana.gov.in ద్వారా జూలోని ఏదైనా జంతువును ఒక రోజు నుంచి గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు దత్తత తీసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా, తక్షణ సంతకం చేసిన మెమోరాండం కాపీ జారీ చేస్తామని చెప్పారు. నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్ 80 G క్రింద నమోదు చేయబడిందని.. CSR కార్యకలాపాలను చేపట్టడానికి కూడా (రిజిస్ట్రేషన్ నంబర్: CSR00074097) వీలవుతుందని అన్నారు. అందువల్ల వ్యక్తులు లేదా కంపెనీ/కార్పొరేట్ కంపెనీలు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80G (2) & (5) కింద ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చని అన్నారు. CSR కింద నిధులను విరాళంగా ఇవ్వవచ్చని అన్నారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు/కంపెనీలు/కార్పొరేట్ రంగాలు ఏరోజైనా మమ్మల్ని సంప్రదించవచ్చని అన్నారు.