Doctor In Dating App: డేటింగ్ యాప్‌కు డాక్టర్ బానిస! కోటిన్నర హుష్‌కాకీ - అరెస్టు చేస్తే వదిలేయాలని రచ్చ, ఇప్పుడు ఇంకో ట్విస్ట్!
Hyderabad Doctor: మొత్తం మూడు దఫాలుగా ఈ దోపిడీ జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా డాక్టర్ వ్యవహరిస్తున్న తీరు చూసి పోలీసులే అవాక్కవుతున్నారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల మోజులో పడి లక్షలు, కోట్లు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. యువకులు, సామాన్యులే కాకుండా చదువుకున్నవారు, నిపుణులు కూడా వాటి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ డేటింగ్ యాప్ కు బాగా అలవాటు పడ్డ హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ఏకంగా కోటీ 50 లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం మూడు దఫాలుగా ఈ దోపిడీ జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా డాక్టర్ వ్యవహరిస్తున్న తీరు చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. తడవకోసారి మనసు మార్చుకుంటూ అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత డాక్టర్ సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని, కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లకు కూడా ఎంపికై ఉద్యోగం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌లో విధుల్లో ఉన్నారు. 2020లో ఈయన ఓ డేటింగ్ యాప్‌లో సైన్ అప్ అయ్యారు. అలా క్రమంగా ఆ యాప్‌కు బానిసగా మారారు. అందులో ఉండే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా అమ్మాయిలు మాట్లాడేవారు. పక్కా ప్లాన్‌తో డాక్టర్‌ను వారు ఉచ్చులో పడేసి, రొమాంటిక్ ఛాటింగ్ చేస్తూ రూ.41 లక్షలు దోచుకున్నారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ కుటుంబ సభ్యులు రెండేళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.
డేటింగ్ యాప్‌కు బాగా అలవాటు పడిపోయిన డాక్టర్ అప్పుడు 2 నెలల తర్వాత మళ్లీ అందులోకి లాగిన్ అయ్యారు. ఇలా చాటింగ్, వీడియో చాట్ చేస్తూ దాదాపు మరో రూ.30 లక్షలు పోగొట్టుకున్నారు. మళ్లీ గుర్తించిన డాక్టర్ కుటుంబ సభ్యులు ఆ బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయగా.. ఆ డాక్టర్ తాను దాచుకున్న మొత్తంతో పాటు అప్పులు చేసి మరి అవతలివారికి డబ్బు వేసినట్లుగా తేలింది.
ఇదిలా ఉండగా, అదే కేసులో నిందితుడ్ని గుర్తించి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. డాక్టర్ అకౌంట్ నుంచి ఇతని అకౌంట్ లో 18 లక్షలు జమ అయినట్లుగా గుర్తించి, పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. కొన్ని రోజులకు డాక్టర్ అడ్డం తిరిగాడు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు ఇచ్చే డబ్బు కూడా తనకు వద్దని, అతణ్ని వదిలేయమని పోలీసులపైనే ఒత్తిడి చేశారు. కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు చెప్పినా డాక్టర్ వినపించుకోలేదు. చివరకు లోక్ అదాలత్‌లో కేసు రాజీ కుదుర్చుకున్నాడు.
కొద్ది కాలానికి మళ్లీ అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్‌లు వచ్చాయి. ఇంత జరిగాక కూడా వారిని నమ్మి మరోసారి రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నారు. ఆఖరికి రోజువారి ఖర్చులకి కూడా డబ్బుల్లేని స్థితికి చేరుకున్నారు. మళ్లీ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు విచారణ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటంతోనే డాక్టర్ ఈ విధంగా చేస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.