Sathwik Suicide Case: సాత్విక్ కేసులో పోలీసుల కీలక రిపోర్ట్ - రోజూ స్టడీ అవర్స్ లో జరిగేది ఇదేనంటూ!
Sathwik Suicide Case: శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాజమాన్యం వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Sathwik Suicide Case: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డు కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే పోలీసులు కూడా రిమాండ్ రిపోర్టు వెల్లడించారు. అందులో అనేక ఆసక్తికర విషయాలను తెలిపారు. రిపోర్టు ప్రకారం.. కళాశాల వేధింపుల వల్లే సాత్విక్ మృతి చెందాడని అందులో వివరించారు. సాత్విక్ ను తిట్టడం వల్లే మనస్తాపం చెందాడని.. విద్యార్థుల ముందు కొట్టడం వల్లే మనస్తాపం చెందినట్లు స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ తో పాటు లెక్చరర్లు తరచుగూ తిట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. చనిపోయిన రోజు స్టడీ అవర్ లో ఆచార్య, కృష్ణారెడ్డి సాత్విక్ ను చితకబాదారన్నారు. హాస్టల్ లో కూడా సాత్విక్ ను వేధించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అంతకు ముందు ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహత్యపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాళాశాలలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కళాశాలలో అడ్మిషన్.. మరో కాళాశాలలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కళాశాలలో వేధింపులు నిజమేనని, ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.
ఇటీవలే నలుగురి అరెస్టు
హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారకులైన ప్రొఫెసర్ ఆచార్య, వార్డెన్ నరేష్ తోపాటు కృష్ణారెడ్డి, జగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురికి నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల క్లాస్ రూమ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాత్విక్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్న ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్‌తోపాటు జగన్‌పై 305 సెక్షన్ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు.
సూసైడ్ లేఖ ఆధారంగా అరెస్టులు
నలుగురు టీచర్ల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సాత్విక్ సూసైడ్ లేఖలో రాశాడు. "అమ్మా నాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు కానీ ఈ మెంటల్ టార్చర్ వల్లే చనిపోతున్నాను. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు ఆచార్య, నరేశ్, శోభన్ హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోవడం నా వల్ల కావడంలేదు. ఇలాంటి వేధింపులు ఇంకెవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. విద్యార్థులను మెంటల్ టార్చర్ చేస్తున్న వీరందరిపై కఠినచర్యలు తీసుకోవాలి" అని సాత్విక్ లేఖలో ఉంది. ఈ లేఖతో పాటు, సాత్విక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 305 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.