Revanth Reddy Assets: రేవంత్ రెడ్డిపై 89 పెండింగ్ కేసులు, లక్షల విలువ చేసే 2 తుపాకులు, అప్పులు కోట్లలోనే!
Telangana Election 2023: రెండు చోట్ల రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొన్నారు.
Revanth Reddy Latest News: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన కొండంగల్ నుంచి రేవంత్ యథాతథంగా బరిలో ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా ఆయన్ను ప్రత్యర్థిగా ఎదుర్కోబోతున్నారు. ఈ క్రమంలోనే రెండు చోట్ల రేవంత్ రెడ్డి (Revanth Reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి తన ఆస్తులు, ఆప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొన్నారు.
అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డిపై వివిధ కేసులు 89 పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఎక్కడా దోషిగా తేలలేదు. ముఖ్యంగా రెండు తుపాకులు, రెండు కార్లు ఉన్నాయి. ఈ రెండు కార్లలో ఒకటి సెకండ్ హ్యాండ్ కారు. వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డి దగ్గర.. రూ.5,34,000 నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో ఉంది. రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత పేర్ల మీద కలిపి ఉన్న స్థిర, చరాస్తుల అన్నిటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా వివరించారు. ఇంకా రేవంత్ వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్ ఒకటి, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ మరొకటి ఉన్నాయి.
అప్పులు కూడా..
రేవంత్ రెడ్డి ((Revanth Reddy Wife), భార్య గీత పేరు మీద మొత్తం కలిపి రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వద్ద రెండు వాహనాల్లో ఒకటి హోండా సిటీ కారు, రెండోది మెర్సిడిస్ బెంజ్ కారు. వాటిలో మెర్సిడిస్ బెంజ్ కారు సెకండ్ హ్యాండ్ కారు అని పేర్కొన్నారు. రేవంత్ భార్య దగ్గర 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.83,36,000. దీంతో పాటు గీత వద్ద రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా ఉన్నాయి.