Revanth Reddy: చేరికలతో జోరుమీద కాంగ్రెస్! తాజాగా మాజీ ఎంపీని కలిసిన రేవంత్ రెడ్డి
రాష్ట్ర నాయకత్వం కూడా అలాంటి వారిని కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోంది. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో అసంతృప్తులు పెరగడాలు, మరో పార్టీ కండువా కప్పుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి. గతేడాది వరకూ బీజేపీలోకి వలసలు, చేరికలు సాగగా, ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నుంచి అక్కడ అసంతృప్తు నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా అలాంటి వారిని కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోంది. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని వివేక్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయనతో దాదాపు గంటన్నరపాటు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలిసింది. కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ వెంకట స్వామి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వివేక్ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారమూ జరిగింది. ఈ ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, వివేక్ వెంకటస్వామి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.