Telangana LRS Extension: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు- మే 3 లోపు పూర్తి చేసుకునే ఛాన్స్
Telangana LRS Extension:తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పెంచింది. ఈ మేరకు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana LRS Deadline : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును పెంచింది. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే టైంలో సాంకేతికంగా కూడా ఫీజులు చెల్లించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నార. అందుకే ప్రజల నుంచి వస్తున్న స్పందనతోపాటు క్లియర్ చేయాల్సిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. దీన్ని మరో మూడు రోజులు అంటే మే 3 వరకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాత్రి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
క్రమబద్ధీకరణతో ఏం ప్రయోజనం
అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో ల్యాండ్ రెగ్యులలరైజేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. కొంత ఫైన్‌తో అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఆమోదిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అంగీకరిస్తుంది. అందుకే ఈ స్కీమ్ కింద భారీ సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇదే ఆఖరి ఛాన్స్ అంటున్న అధికారులు
2025 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్ఎస్ కింద ఫీజులు చెల్లించే వారికి 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మార్చి 31 నాటికి చెల్లించే వారికి మాత్రమే వర్తిస్తుందని మొదట పేర్కొంది. అయితే చాలా మంది దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యలు, వెబ్‌సైట్‌లో లోపాలు, ఇతర అడ్డంకుల వల్ల చెల్లింపులు చేయలేకపోయారు. వారి అభ్యర్థన మేరకు గడువును ఏప్రిల్ 30 వరకు పెంచారు. అయినా ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరో మూడు రోజులు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తర్వాత దరఖాస్తు చేసే ఏమవుతుంది
ఈ పథకం కింద దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్ ఫీజుతోపాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను కూడా చెల్లించవచ్చు. ఈ రెండింటిపై 25 శాతం రాయితీ వస్తుంది. మే 3 లోపు చెల్లించే వాళ్లకే ఈ రాయితీ వర్తిస్తుంది. తర్వాత చెల్లిస్తే కచ్చితంగా వంద శాతం ఫీజు కట్టించుకుంటారు.
ఈ స్కీమ్ నుంచి భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించింది. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో భారీ సంఖ్యలో క్రమబద్దీకరణకు వస్తారని ఆలోచించింది. మార్చి చివరి నాటికి రెండు లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. ఏప్రిల్ 30 నాటికి మరో లక్షన్నర దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఈ మూడు రోజుల గడువు పెంపుతో మరిన్ని దరఖాస్తులు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
దరఖాస్తుదారులకు సూచనలు
ప్రభుత్వం దరఖాస్తుదారులకు మూడు రోజుల గడువులో చెల్లింపులు పూర్తి చేయాలని సూచించింది. ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ https://lrs.telangana.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సమస్యలు ఎదురైతే హెచ్‌ఎండీ ఫోన్ నెంబర్ 18005998838కి ఫోన్ చేసి సాయం పొందవచ్చు. మేడే సెలవు అయినప్పటికీ ఈ పోర్టల్ పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.





















