Rahul Gandhi: 100 రోజుల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుంది, కాంగ్రెస్ వచ్చాక హామీలు నెరవేర్చుతాం: రాహుల్ గాంధీ
Rahul Gandhi at at Vijayabheri Sabha in Tukkuguda: తెలంగాణలో మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi at at Vijayabheri Sabha in Tukkuguda:
రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ తో మాత్రమే కాదు బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పోరాడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు వేరే అని చెబుతున్నా, వారు కలిసి పనిచేస్తారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. రైతు బిల్లుకు, జీఎస్టీకి, ఎన్నికల్లో సైతం మోదీ అడగగానే బీఆర్ఎస్ మద్దతు పలికిందని గుర్తుచేశారు. ఈరోజు సైతం కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసుకుందని.. ఆ పార్టీలు సైతం ఉద్దేశపూర్వకంగానే వేర్వేరుగా సభలు నిర్వహించాయని ఆరోపించారు. కానీ విపక్ష నేతలపై కేసులున్నాయి.. ఈడీ, సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ అధికారులపై కేసులు నమోదు చేస్తున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై, ఎంఐఎం నేతలపై సైతం బీజేపీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదని రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
సొంత మనుషులు అని బీఆర్ఎస్, ఎంఐఎం నేతలను వదిలేసి, కేవలం కాంగ్రెస్ నేతలపై కేసులు బనాయించారని కేంద్రంపై ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట నిలబెట్టుకుంటారని రాహుల్ అన్నారు. 2012లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ఆలోచిస్తామని సోనియా అన్నారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. బీజేపీ అంటే బీఆర్ఎస్ బంధువుల సమితి అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, అందుకోసం మేం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. రైతులు, మహిళలు, బలహీనవర్గాలు, యువత కోసం రాష్ట్రం ఇస్తే.. 9 ఏళ్లలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదని కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు.
100 రోజుల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుంది..
తెలంగాణలో మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఎంతగా శ్రమించినా అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఆరు గ్యారంటీలను ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకంతో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు ఇస్తామన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామన్నారు. ప్రధాని మోదీ వెయ్యి రూపాయలకు పైగా నగదుతో ఎల్పీజీ సిలిండర్ ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. కర్ణాటక తరహాలోనే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మూడో హామీ గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు అందిస్తాం. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
చేయూత పథకం ద్వారా నెలవారీ పింఛను రూ.4,000 చేస్తామని ప్రకటించారు. రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000.. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామన్నారు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ సర్కార్ లక్ష కోట్లు దోచుకుందని, ధరణి పోర్టల్ ద్వారా భూములు లాక్కున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకంతో భూస్వాములు, ధనికులకు లబ్ది చేకూరిందన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్లు లీక్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. నరేంద్ర మోదీ కేవలం అదానీకి లాభాన్ని చేకూర్చుతున్నారని, తద్వారా ప్రపంచ కుబేరుడిగా అవతరించారని చెప్పారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే తనపై మోదీ సర్కార్ కక్షగట్టి ఎంపీ పదవి నుంచి తొలగించిందన్నారు. కేసీఆర్ తన మనిషి కనుక ఆయన అవినీతిపై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీతో తాము పోరాడుతుంటే ఎంఐఎం, బీఆర్ఎస్ కమలం పార్టీకి మద్దతుగా ఉంటారని, ప్రజలు ఈ విషయం తెలుసుకోవాలన్నారు.