డిప్యూటీ సీఎం భట్టి కాన్వాయ్‌లోని కారును ఆపేసిన కమిషనర్ - పోలీసుల అత్యుత్సాహం!
Telangana Congress: మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని పోలీసులు బయటే నిలిపేశారు. కాన్వాయ్ డ్రైవర్ శ్రీనివాస్‌పై పోలీసులు చేయి చేసుకున్నారు.
Telangana News: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇదే సభకు హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. భట్టి సమావేశానికి హాజరైన క్రమంలో ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని పోలీసులు బయటే నిలిపేశారు. లోపలకు అనుమతించకుండా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనమని, సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని చెబుతున్నారు.
పైపెచ్చు డ్రైవర్ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చేయి చేసుకున్నారని అంటున్నారు. డ్రైవర్ జేబులోని ఐఈడీ కార్డు లాక్కుని, వాహనాన్ని నిలిపేశారని సమాచారం. అంతటితో ఆగకుండా మరింత పోలీసులు డ్రైవర్‌ను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. అరగంట తరువాత తిరిగి ఆ డ్రైవర్‌ను పిలిపించిన అధికారులు.. చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించిన వీడియో గ్రాఫర్, ఇతరుల సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కుని చేయి చేసుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.
పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు
కాన్వాయ్‌ను లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు డ్రైవర్‌పై చేయి చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ సమాధానం చెబుతున్న వినకుండా ఐడీ కార్డు తీసుకోవడంతోపాటు వీడియో తీసిన వారి నుంచి ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ శ్రీనివాస్‌పై మూకుమ్మడిగా పోలీసులు దాడికి పాల్పడ్డారని పలువురు చెబుతున్నారు. రాచకొండ సీపీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించనట్టు తెలుస్తోంది. డ్రైవర్‌ను పోలీసులు చట్టుముట్ట కొడుతున్న సమయంలో అక్కడున్న వారిని పోలీసులు బెదిరించి పంపించే ప్రయత్నం చేశారు. వీడియోలు తీస్తున్న వారిపైనా దురుసుగా పోలీసులు ప్రవర్తించడంతోపాటు తరిమేశారు.