Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Allu Arjun Arrest In Hyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై రెండు సెక్షన్‌ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ సెక్షన్‌ల ప్రకారం నేరం రుజువు అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్ష పడొచ్చు.
Pushpa Hero Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది. ఎలాంటి హడావుడి లేకుండా కూల్‌గా హీరో ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అరెస్టు విషయాన్ని చెప్పారు. రెండు సెక్షన్‌ల కింద అల్లు అర్జున్‌పై కేసులు పెట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.
పుష్పరాజ్‌పై పెట్టిన కేసులు ఇవే
భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 118 (1), భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టం. ఈ సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 118 (1) సెక్షన్ ప్రకారం కూడా నేరం రుజువు అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చట్టం చెబుతోంది.
హైకోర్టులో పిటిషన్
కేసులో తీవ్ర దృష్ట్యా అరెస్టు తప్పదని గ్రహించిన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చికడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టేయాలని పిటిషన్ వేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా చాలా మంది నటులు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తారని ఆరోజు తాను కూడా అలానే వెళ్లానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో తన తప్పేమీ లేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చుకున్నారు. ఇంకా ఈ కేసులో తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో సంద్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి కూడా హైకోర్టులో సవాల్ చేశారు. థియేటర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించామని వివరించారు. వాళ్లే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకున్నారని తెలిపారు. అన్నింటికీ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. కేవలం సెక్యూరిటీని మాత్రమే తాము కల్పించామన్నారు. ఈ ఘటనలో తమపై కేసులు పెట్టడం సరికాదని కొట్టేయాలని అభ్యర్థించారు.
డిసెంబర్ 4న ఏం జరిగింది?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఈ నెల 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అంతకుముందు రోజు రాత్రి డిసెంబర్ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. ఆ షో చూసేందుకు దిల్‌షుఖ్ నగర్ నుంచి వచ్చిన ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. బెనిఫిట్ షో వేళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌షుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఆమెతోపాటు తొమ్మిదేళ్ల కుమారుడు సాయితేజ్ కూడా కిందపడి గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దీనిపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ... అప్పటి వరకు జనం ఉన్నప్పటికీ తోపులాట జరగలేదని... అల్లు అర్జున్ రావడంతోనే తోలుపులాట జరిగిందంటున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందర్నీ విచారించిన పోలీసులు వీళ్లందరిపై కేసులు పెట్టారు. ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు.
ఘటన జరిగిన రోజున డీసీపీ అక్షాంశ్ యాదవ్ కామెంట్స్ ఇవే...
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని..కీలక నటులు కూడా ప్రేక్షకులతో పాటూ హాజరవుతారనే సమాచారం లేదన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ లలో పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదన్నారు. నటీ నటులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయలేదు. తొమ్మిదిన్నర గంటలకు తన వ్యక్తిగత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని.. థియేటర్ లోపలకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టేయడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో రేవతి ప్రాణం పోయిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: హీరో అల్లు అర్జున్ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు