Exgratia to Preethi Family: ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా, మంత్రి హామీ
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రి ఎర్రబెల్లి మరో రూ.20 లక్షలు ప్రకటించారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థి ప్రీతి మృత్యువుతో పోరాడి ఓడింది. గత ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆదివారం రాత్రి చనిపోయింది. ఈ విషయాన్ని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రీతి మరణం పట్ల తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని మృతి బాధాకరం అన్నారు. ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అలాగే ప్రీతి ఘటన పై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
మెడిసిన్ పీజీ ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వపరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూ.20 లక్షలు ప్రకటించారు. వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసుకుని ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన విద్యార్థిని చనిపోయిందని తెలియగానే సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ర్యాగింగ్, వేధింపుల ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే..
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మెడికో ప్రీతి మృతి బాధాకరం, ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాద కలిగిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్, ప్రీతి మరణం పట్ల నివాళులు అర్పించిన మంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రీతి మృతిచెందినట్లు వైద్యుల ప్రకటన..
కేఎంసీ ( కాకతీయ మెడికల్ కాలేజీ)లో సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. చనిపోదామని హానికర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని గుర్తించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు రాలేదు, వైద్యానికి ప్రీతి అవయవాలు స్పందించడం లేదని, ఆరోగ్యం మెరుగు అవుతున్న సూచనలు కనిపించడం లేదని మొదట్నుంచీ డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ప్రీతి ఆదివారం రాత్రి చనిపోయింది. ఆమె మరణంపై నిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.